క్యాష్‌ కొట్టు.. పోస్టు పట్టు | - | Sakshi
Sakshi News home page

క్యాష్‌ కొట్టు.. పోస్టు పట్టు

Aug 22 2026 1:41 AM | Updated on Aug 22 2026 1:41 AM

అనర్హులకు అందలం..

మేస్త్రికి రెండు ఇన్‌చార్జి పోస్టులు

రూ.లక్షల్లో ముడుపులు

ముట్టచెప్పినట్లు ఆరోపణలు

అర్హులను కాదని అనర్హులకు పోస్టులు కట్టబెట్టడంపై విమర్శలు

విచారణ జరిపితే వాస్తవాలు

వెలుగులోకి వచ్చే అవకాశం

నెల్లూరు(బారకాసు): నగరపాలక సంస్థ (ఎన్‌ఎంసీ)లో ఏ పని కావాలన్నా ‘చేయి తడపాల్సిందే’ అన్న ఆరోపణలున్నాయి. ప్రతి పనికీ ఓ రేటు.. ముడుపులు ముట్టచెప్పితే పోస్టులు సైతం దక్కుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హెల్త్‌ విభాగంలో నిబంధనలకు విరుద్ధంగా ఓ మేస్త్రికి రెండు కీలక పోస్టుల్లో ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.

ఏం జరిగిందంటే..

ఎన్‌ఎంసీ హెల్త్‌ విభాగంలో రెగ్యులర్‌ మేస్త్రిగా పనిచేస్తున్న దర్శిగుంట రమణయ్యను రెండు కీలక పోస్టుల్లో ఇన్‌చార్జిగా నియమిస్తూ ఈనెల 12, 13 తేదీల్లో ఉత్తర్వులు జారీ చేశారు. 12న 51వ డివిజన్‌ ఇన్‌చార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా, 13న మాగుంట లేఅవుట్‌, కిమ్స్‌ హాస్పిటల్‌ ప్రాంతం, ఆర్టీసీ వెనుక వైపు, నెల్లూరు హాస్పిటల్‌, పెంచలయ్య హాస్పిటల్‌, అంబేడ్కర్‌ నగర్‌, అరవింద్‌ నగర్‌ ఎక్స్‌టెన్షన్‌, జయభారత్‌ హాస్పిటల్‌ ప్రాంతం, క్రాంతి నగర్‌, కేవీఆర్‌ పెట్రోల్‌ బంక్‌, మద్రాస్‌ బస్టాండ్‌, ఎంజీబీ మాల్‌ తదితర ప్రాంతాలకు ఇన్‌చార్జి హెల్త్‌ అసిస్టెంట్‌గా బాధ్యతలు అప్పగించారు.

అర్హత లేకున్నా..

నిబంధనల ప్రకారం రెగ్యులర్‌ మేస్త్రిగా ఐదేళ్లు పూర్తి చేసి, ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన ఉద్యోగులకు హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టు ఇచ్చే అవకాశం ఉంది. అయితే పదో తరగతి కూడా ఉత్తీర్ణత సాధించని రమణయ్యకు హెల్త్‌ అసిస్టెంట్‌తోపాటు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులోనూ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అర్హులు ఉండగా..

ఎన్‌ఎంసీలో హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఎనిమిది ఉండగా, ఇటీవల ఒకరు ఉద్యోగ విరమణ చేయడంతో ఒక పోస్టు ఖాళీ అయింది. అందులో ఇన్‌చార్జిని నియమించాలంటే ఎన్‌ఎంసీ పరిధిలోని 166 సచివాలయాల్లో శానిటరీ సెక్రటరీలుగా పనిచేస్తున్న సుమారు 108 మందిలో అర్హత ఉన్నవారికి అవకాశం క ల్పించవచ్చని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. వీరిని కాదని అనర్హుడైన రమణయ్యకు రెండు పోస్టుల బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ముడుపుల ఆరోపణలు

రమణయ్యకు రెండు పోస్టుల బాధ్యతలు అప్పగించడం వెనుక సంబంధిత అధికారికి రూ.లక్షలు ముడుపులుగా ముట్టచెప్పినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నిబంధనలను పక్కనపెట్టి ఇలాంటి నియామకాలు ఎలా చేపట్టారనే దానిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

ఏసీబీ తనిఖీలు చేసినా..

ఎన్‌ఎంసీ ప్రజారోగ్య విభాగంలో గతంలో ఏసీబీ అధికారులు రికార్డులను తనిఖీ చేసి పలు అవకతవకలను గుర్తించి రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదికలు పంపినట్లు సమాచారం. దీనిపై ఇటీవల సంబంధిత ఉద్యోగుల నుంచి వివరణ కోరుతూ ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేశారు. ఇంత జరిగినా హెల్త్‌ విభాగంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారాలు జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. రెండు ఇన్‌చార్జి పోస్టులు ఒకే ఉద్యోగికి అప్పగించిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను నిగ్గు తేల్చాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement