నేటి నుంచి ప్రత్యేక శిబిరాలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ప్రత్యేక శిబిరాలు

Aug 22 2026 1:41 AM | Updated on Aug 22 2026 1:41 AM

నెల్లూరు రూరల్‌: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ముసాయిదా జాబితాపై క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణకు గానూ ప్రత్యేక శిబిరాలను శని, ఆదివారాల్లో నిర్వహించనున్నామని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది జూలై ఒకటి అర్హత తేదీ ఆధారంగా రూపొందించిన ముసాయిదా జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించనున్నామని వివరించారు. జిల్లాలోని ప్రతి పోలింగ్‌ కేంద్రంలో బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌ ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్‌ లెవల్‌ ఏజెంట్లూ పాల్గొననున్నారని చెప్పారు. ముసాయిదా జాబితాతో పాటు ఫారం – 6, 7, 8ను అందుబాటులో ఉంచుతామని వివరించారు.

కిలో పొగాకు

గరిష్ట ధర రూ.250

కలిగిరి: కలిగిరిలోని పొగాకు వేలం కేంద్రంలో కిలో పొగాకుకు గరిష్ట ధర రూ.250 శుక్రవారం లభించింది. జనరల్‌ క్లస్టర్‌కు చెందిన రైతులు 584 బేళ్లను తీసుకురాగా, 442ను కొనుగోలు చేయగా, వివిధ కారణాలతో 142 తిరస్కరణకు గురయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహణాధికారి రాజశేఖర్‌ మాట్లాడారు. కనిష్టంగా రూ.110.. సరాసరిన రూ.167.97 లభించిందని వెల్లడించారు. పది కంపెనీలు హాజర య్యాయని తెలిపారు.

డీసీపల్లిలో 596 బేళ్ల విక్రయం

మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో 596 బేళ్లను విక్రయించామని నిర్వహణాధికారి సునీల్‌కుమార్‌ తెలిపారు. వేలానికి 694 బేళ్లు రాగా, అందులో వివిధ కారణాలతో 98ను తిరస్కరించామని చెప్పారు. గరిష్టంగా రూ.250.. కనిష్టంగా రూ.110.. సగటు ధర రూ.193.26 గా నమోదైందని వెల్లడించారు. 11 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారని చెప్పారు.

మహిళతో

అసభ్యకర ప్రవర్తన

చేజర్ల: ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌, చేజర్ల శాఖకు వెళ్లిన తనతో అక్కడి పనిచేసే గోల్డ్‌ స్మిత్‌ వెంకటరమణయ్య అసభ్యంగా ప్రవర్తించారని మండలంలోని తూర్పుకంభంపాడుకు చెందిన పంచేటి కృష్ణవేణి ఆరోపించారు. ఈ మేరకు మేనేజర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బ్యాంక్‌లో బంగారాన్ని తాకట్టు పెట్టి నగదు తీసుకునేందుకు శుక్రవారం ఆమె వెళ్లగా, సదరు గోల్డ్‌ స్మిత్‌ అసభ్యకరంగా మాట్లాడటంతో నిలదీశారు. దీంతో బ్యాంక్‌ పుస్తకం, విలువైన బంగారు ఆభరణాలను ఆమె ముఖంపై రమణయ్య విసిరికొట్టారు. దీనిపై చర్యలు చేపట్టాలని ఆమె కోరారు.

మూడో విడత

అక్రిడిటేషన్లకు అవకాశం

నెల్లూరు రూరల్‌: మూడో విడత అక్రిడిటేషన్‌ కార్డుల మంజూరుకు గానూ అర్హత కలిగి ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని జర్నలిస్టులు శనివారం సాయంత్రం ఐదు గంటల్లోపు దాఖలు చేసుకోవాలని జిల్లా సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఆన్‌లైన్లో దరఖాస్తులను సమర్పించిన అనంతరం, దాని ప్రతిని తమ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

శ్రీవారి దర్శనానికి

24 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయి.. కృష్ణ తేజ అతిథి గృహం వద్దకు క్యూ చేరుకుంది. స్వామివారిని 70,114 మంది గురువారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 28,963 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.86 కోట్లను సమర్పించారు. టైమ్‌ స్లాట్‌ టిక్కెట్లున్న వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement