అక్రమ లేఅవుట్లతో దందా | - | Sakshi
Sakshi News home page

అక్రమ లేఅవుట్లతో దందా

Aug 22 2026 1:41 AM | Updated on Aug 22 2026 1:41 AM

అనుమతుల్లేకపోయినా ప్లాట్ల విక్రయాలు

పట్టించుకోని రెవెన్యూ, నుడా, పంచాయతీ అధికారులు

మోసపోతున్న కొనుగోలుదారులు

వింజమూరు(ఉదయగిరి): వింజమూరులో అక్రమ లేఅవుట్లు పెద్ద సంఖ్యలో వెలుస్తున్నాయి. నుడా, పంచాయతీ, రెవెన్యూ అనుమతుల్లేకుండానే వ్యవసాయ భూములను కొనుగోలు చేసి ప్లాట్లుగా విభజించి విక్రయాలు సాగిస్తూ రూ.కోట్లల్లో ఆర్జిస్తున్నారు. పూర్తి స్థాయిలో పరిశీలించే ఆలోచన లేక బ్రోకర్ల మాటలు విని ఎంతో మంది మోసపోతున్నారు. వింజమూరులో పలు లేఅవుట్లను ఇరిగేషన్‌, పొరంబోకు భూముల్లో కలిపేసి ప్లాట్లుగా మార్చి అమ్ముతున్నారు.

సీసీఎల్‌ఏకు ఫిర్యాదు

జైబీమ్‌నగర్‌ పక్కన ఏర్పాటు చేసిన 239 – 4 సర్వే నంబర్‌ లేఅవుట్‌ నిబంధనల మేరకు లేదంటూ కాలనీ వాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. క్రయ, విక్రయాల్లో అవకతవకలున్నాయంటూ ఓ వ్యక్తి ఏకంగా సీసీఎల్‌ఏకు ిఫిర్యాదు చేశారు. నుడా అనుమతి లేకుండా రోడ్లు, ప్రహరీని ఏర్పాటు చేసినా.. రెవెన్యూ, పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. భట్టువారిపాళెం రోడ్డులో కొత్తగా ఏర్పాటు చేస్తున్న లేఅవుట్‌ పరిస్థితీ ఇంతే. కాగితాలపై మ్యాప్‌ వేసి అమ్ముతున్నారు. నూతనంగా నెలకొల్పే వెంచర్లలో ఎకరాకు రూ.నాలుగు లక్షల నుంచి రూ.పది లక్షల వరకు అధికార పార్టీకి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధి కార్యాలయం వసూలు చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు సైతం ముడుపులు పుచ్చుకొని అటువైపు కన్నెత్తి చూడటంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఉమ్మడి సర్వే కోసం తహసీల్దార్‌కు ఇరిగేషన్‌ అధికారులు లేఖలు రాశారు. అయినా దీన్ని చేపట్టకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఉండేది 24.. అనుమతులు నాలుగింటికే..

వింజమూరు, నందిగుంట పంచాయతీల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇక్కడ 24 లేఅవుట్లుండగా, వీటిలో అనుమతులు పొందింది కేవలం నాలుగే. గతంలో ఎమ్మెస్సార్‌ డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న లేఅవుట్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి లీగల్‌ సమస్యలు రావడంతో క్రయవిక్రయాలు ఆగిపోయి పలువురు ఆర్థికంగా నష్టపోయారు. కోర్టు కేసులు నేటికీ వెంటాడుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వెంచర్లకు నుడా అనుమతుల్లేవు. వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి ప్లాట్లుగా మార్చి అమ్మకాలు సాగిస్తున్నారు. వీటిలో కొన్ని చోట్ల ఇరిగేషన్‌ స్థలాలూ కలిసి ఉన్నాయి. వేరే సర్వే నంబర్లను చూపి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.

ప్లాట్లు కొంటే నష్టపోతారు

వింజమూరులో 19 అక్రమ లేఅవుట్లున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసే వాటికి నుడా అనుమతుల్లేవు. ఇక్కడ ఎవరైనా కొనుగోలు చేస్తే నష్టపోతారు. రెవెన్యూ, నుడా అధికారులతో కలిసి వీటిపై చట్టపరమైన చర్యలు చేపడతాం.

– రామారావు, ఈఓ, వింజమూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement