అభివృద్ధి పనులు చేయడం చేతగాని కూటమి నేతలు.. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన డెవలప్‌మెంట్‌ను చూసి ఓర్వలేకపోతున్నారు. ఏదో తరహాలో దుష్ప్రచారం చేస్తూ తామేదో సాధించాలనే రీతిలో కలలుగంటూ చివరికి అభాసుపాలవుతున్నారు. పేదలకు ఇల్లుండాలనే మహోన్నత ఆశయంతో జగనన్న కాలనీలను గత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీర్చిదిద్ది వారి కళ్లల్లో ఆనందాన్ని నింపారు. చివరికి దీనిపైనా టీడీపీ నేతలు విషం గక్కుతూ ప్రజల ఆగ్రహాన్ని చవిచూస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సర్వేపల్లి నియోజకవర్గంలో గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను చూసి కూటమి నేతలు ఓర్వలేకపోతున్నారు. ఇక్కడ ఏళ్ల తరబడి సొంతింటి స్వప్నాన్ని నెరవేర్చుకోవాలని ఎదురుచూసిన కుటుంబాల కలను అప్పటి మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో సాకారం చేశారు. దీంతో నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో జగనన్న కాలనీల పేరుతో ప్రత్యేకంగా ఊళ్లే ఏర్పడ్డాయి. దీన్ని తట్టుకోలేని కూటమి ప్రభుత్వం.. జగనన్న కాలనీలపై విషప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగానే వెంకటాచలంలోని కాలనీపై కొద్ది రోజులుగా వీరు విషం కక్కుతుండటంపై స్థానికులు మండిపడుతున్నారు.
గతంలో అన్నీ కష్టాలే..
వెంకటాచలంలో వందల కుటుంబాలకు 2019 ముందు వరకు సొంతిల్లు లేక అద్దె గృహాల్లోనే ఉండేవారు. కొన్ని ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఈ స్తోమత లేక స్థానిక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఉండే చెట్ల నీడ కిందే గుడిసెలేసుకొని నివసించేవారు. అప్పట్లో సర్వేపల్లి ఎమ్మెల్యేగా ఉన్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి దృష్టికి ఇళ్ల స్థలాలు, నిర్మాణాల విషయాన్ని గిరిజనులు పలుమార్లు తెలియజేశారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో, తమ సర్కార్ కొలువుదీరాక అర్హులందరికీ న్యాయం జరుగుందని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరాక పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రత్యేక చొరవ చూపారు. ఈ క్రమంలోనే వెంకటాచలంలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న సర్వే నంబర్ 667 – 3లో 14.16 ఎకరాలు ఇతరుల అన్యాక్రాంతంలో ఉన్నాయనే అంశాన్ని గుర్తించి, దాన్ని పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించారు. చెట్లు, పుట్టలను తన సొంత నిధులను వెచ్చించి చదును చేయించారు. అనంతరం అధికారులతో ప్లాట్లు వేయించి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలను పంపిణీ చేయించారు. ఇల్లు నిర్మించివ్వడంతో లబ్ధిదారులు ఎంతో సంతోషంగా నివాసాల్లో జీవిస్తున్నారు.
నవ్విపోదురు గాక నాకేటి..!
వెంకటాచలంలోని జగనన్న కాలనీలో పార్టీలకతీతంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు. గ్రామంలోని భూములు, ఇళ్లు, స్థలాలపై కోర్టులో కేసు నడుస్తోంది. అయితే టీడీపీ నేతలు మాత్రం దేవదాయ శాఖకు చెందిన భూముల్లో జగనన్న కాలనీ ఉందంటూ దుష్ప్రచారం చేస్తుండటంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. గత ప్రభుత్వంలో అప్పటి మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చేసిన అభివృద్ధిని జీర్ణించుకోలేకే ఇలా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వెంకటాచలంలోని జగనన్న కాలనీలో అర్హులకు ఇళ్లు నిర్మించిన
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం
ఓర్వలేక దుష్ప్రచారాన్ని సాగిస్తూ నవ్వులపాలు
మండిపడుతున్న గ్రామస్తులు


