డిగ్రీలో ప్రవేశాలకు గడువు పొడిగింపు | - | Sakshi
Sakshi News home page

డిగ్రీలో ప్రవేశాలకు గడువు పొడిగింపు

Aug 18 2026 12:09 AM | Updated on Aug 18 2026 12:09 AM

నెల్లూరు (టౌన్‌): డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన గడువును మంగళవారం వరకు పొడిగించామని డీకేడబ్ల్యూ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ గిరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 20 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌.. 23 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు.. 24న వెబ్‌ ఆప్షన్ల ఎడిటింగ్‌, 31న సీట్ల కేటాయింపు, కళాశాలలో వచ్చే నెల రెండులోపు రిపోర్టు చేయాల్సి ఉంటుందని చెప్పారు. కళాశాలలో వివిధ కోర్సులతో పాటు ప్రయోగశాలలు, గ్రంథాలయం, ఎన్నెస్సెస్‌, ఎన్‌సీసీ, జేకేసీ, ఆర్‌ఆర్సీ స్కాలర్‌షిప్‌లు, క్రీడా మైదానం, వసతి గృహం తదితరాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. వివరాలకు 86397 34668 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

ఐటీఐల్లో ప్రవేశాలకు..

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐల్లో 2026 – 27 విద్యా సంవత్సరంలో మూడో విడత ఽప్రవేశాలకు గానూ బుధవారంలోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ప్రభుత్వ ఐటీఐ కన్వీనర్‌ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారు ఏ ఐటీఐలో చేరాలనుకుంటున్నారో అక్కడే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఐటీఐల్లో ఈ నెల 20న.. ప్రైవేట్‌లో ఈ నెల 21న నిర్వహించనున్న కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు. వివరాలకు సమీపంలోని కళాశాలను సంప్రదించాలని కోరారు.

నేటి నుంచి వెంకయ్యస్వామి

ఆరాధనోత్సవాలు

వెంకటాచలం: దక్షిణాదిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గొలగమూడిలోని వెంకయ్యస్వామి 44వ ఆరాధనోత్సవాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. భక్తులను దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్లను ఈఓ బాలసుబ్రహ్మణ్యం చేయిస్తున్నారు. విశేష పూజలు, వేదపారాయణం, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానం, గణపతి పూజను రోజూ నిర్వహించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.

ఉత్సవాలు ఇలా..

ఉత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహనసేవను మంగళవారం ఉదయం, కల్పవృక్ష వాహనసేవను రాత్రి నిర్వహించనున్నారు. సూర్యప్రభ వాహనసేవను 19న ఉదయం, చంద్రప్రభ వాహనసేవను రాత్రి జరపనున్నారు. హనుమంత, హంసవాహనసేవలను 20న.. చినశేష, గజవాహన సేవలను 21న నిర్వహించనున్నారు. అశ్వ, పెదశేష వాహనసేవలను 22న.. సింహ, గరుడవాహన సేవలను 23న నిర్వహించనున్నారు. ఆరాధన మహోత్సవాన్ని చివరి రోజైన 24న ఘనంగా జరపనున్నారు. రథోత్సవాన్ని ఉదయం పదికి, రాత్రి ఎనిమిది గంటలకు నిర్వహించనున్న తెప్పోత్సవంతో ఉత్సవాలు ముగియనున్నాయి.

వేడుకగా సొందల్‌ మాలి

అనుమసముద్రంపేట: ఏఎస్‌పేటలోని హజరత్‌ ఖాజానాయబ్‌ రసూల్‌ గంధమహోత్సవం సందర్భంగా దర్గాలో ఏడాదికోసారి మహిళలను అనుమతించే సొందల్‌ మాలి కార్యక్రమాన్ని వేడుకగా ఆదివారం రాత్రి నిర్వహించారు. అమ్మాజాన్‌, అబ్బాజాన్‌ సమాధులకు గంధం లేపనం చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడమే కార్యక్రమ ప్రత్యేకత. దర్గా ఈఓ హుస్సేన్‌ ప్రత్యేక ఆహ్వానం పలకడంతో ఆదివారం రాత్రి 11 నుంచి తెల్లవారుజామున ఐదు వరకు కార్యక్రమం సాగింది. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. దర్గా నుంచి దొరసానమ్మ తోట వరకు భారీ క్యూలైన్లను పోలీసులు ఏర్పాటు చేసి ప్రవేశానికి అవకాశం కల్పించారు. సీఐ గంగాధర్‌, ఎస్సైలు జిలానీ, సుభాషిణి, భవానీ, భోజ్యానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనానికి

18 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సోమ వారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని 97,014 మంది ఆదివారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. టైమ్‌ స్లాట్‌ టిక్కెట్లున్న భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement