● నిర్మాణాల కూల్చివేత
వెంకటాచలం: మండలంలోని తిక్కవరప్పాడు పంచాయతీ జోసఫ్‌పేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త విడవలూరు రంగయ్యకు చెందిన నిర్మాణ గోడలను జేసీబీతో అధికారులు సోమవారం కూల్చేశారు. దళితుడైన రంగయ్య 20 ఏళ్లుగా తన ఆధీనంలో ఉన్న స్థలంలో గోడౌన్ నిర్మాణ పనులను గతేడాది ప్రారంభించారు. ఆర్థిక ఇబ్బందులతో కొంచెం కొంచెంగా పనులు చేసుకుంటూ వచ్చారు. గోడల నిర్మాణ పనులు పూర్తయ్యాక రేకులను ఇటీవల నిర్మించుకున్నారు. అయితే ఇవి ప్రభుత్వ స్థలంలో ఉన్నాయంటూ అధికారులు ఇటీవల హెచ్చరించడంతో రేకులను ఆయన తొలగించారు. తాజాగా గ్రామానికి అధికారులు చేరుకొని గోడలను కూల్చేశారు. తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడనే కారణంతోనే అన్యాయంగా ఇలా చేశారని రంగయ్య వాపోయారు. తనకు రూ.ఐదు లక్షల నష్టం సంభవించిందని పేర్కొన్నారు.


