● నిధుల గోల్‌మాల్‌లో
పాత్ర లేదని ఆర్జేడీ నివేదిక
● డ్వామా అధికారులపైనే ఆరోపణలు
● కొనసాగుతున్న విజిలెన్స్ విచారణ
నెల్లూరు(టౌన్): సమగ్రశిక్ష ఏపీసీగా వెంకటసుబ్బయ్య రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. సమగ్రశిక్షలో పాఠశాలల ప్రహరీ నిర్మాణాల్లో నిధులు గోల్‌మాల్ జరిగినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీసీతోపాటు సూపరింటెండెంట్ అశోక్‌ను మాతృశాఖకు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం రాష్ట్ర ఉన్నతాధికారులు నిధులు గోల్‌మాల్‌పై ఆర్జేడీ లోకేశ్వరరెడ్డిని విచారణ అధికారిగా నియమించి పూర్తి వివరాలు నివేదిక రూపంలో అందజేయాలని ఆదేశించారు. దీంతో ఆర్జేడీ నేతృత్వంలో పూర్తి స్థాయి విచారణ జరిగింది. ఇందులో వెంకటసుబ్బయ్య, అశోక్, సమగ్రశిక్షకు ఎలాంటి సంబంధం లేదని తేలింది. ఆ నివేదికను రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులకు అందజేశారు. దీంతో వారిద్దరికీ తిరిగి బాధ్యతలు అప్పగించారు. ప్రహరీల నిర్మాణాల నిధులు గోల్‌మాల్ వ్యవహారంలో డ్వామాకు చెందిన ఏపీఓలు, ఎంపీడీఓలు కీలకపాత్ర పోషించినట్లు తెలిసింది. కొన్ని పాఠశాలల్లో ఉపాధి నిధులతో ప్రహరీలు నిర్మించి బిల్లులు తీసుకుని, మరికొన్నిచోట్ల అసలు ప్రహరీలు నిర్మించకుండానే బిల్లులు తీసుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం అంతా డ్వామాలో ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి అధికారుల కనుసన్నుల్లో జరిగిందన్న ప్రచారం సాగుతోంది. నిధులు గోల్‌మాల్‌పై కలెక్టర్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం అది కొనసాగుతోంది. వారు అందించే నివేదికలో ఎవరెవరి పాత్ర ఉంటుందనే చర్చ ఆ శాఖలో జరుగుతోంది.


