ఒకప్పుడు బంగారు పంటగా రైతు ఇంట్లో సిరులు నింపిన పొగాకు.. ఇప్పుడు అదే కర్షకులకు కన్నీళ్ల వేదనగా మారింది. లక్షలాది రూపాయలను పెట్టుబడిగా పెట్టి, నెలల తరబడి చెమటోడ్చి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ప్రతి కిలోపై నష్టాన్ని మూటగట్టుకుంటున్నారు. ఉత్పత్తి వ్యయం సైతం తిరిగి రాని పరిస్థితుల్లో వేలాది బేళ్లు కొనుగోలుకు నోచుకోకుండా కేంద్రాల్లోనే పేరుకుపోతున్నాయి. అప్పులు తీర్చే దారి కనిపించక, వడ్డీ భారం రోజురోజుకూ పెరుగుతుండటంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. గిట్టుబాటు ధర, వేగవంతమైన కొనుగోళ్లపై డిమాండ్లు కొనసాగుతున్నా, ఆశించిన స్థాయిలో మార్పు కానరావడంలేదు. ఖర్చులు అమాంతం పెరిగి, ధరలు కుప్పకూలిపోవడంతో వీరిలో ఆవేదన వ్యక్తమవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే సీజన్లో పొగాకు సాగుకే దూరమయ్యే ప్రమాదం పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
మర్రిపాడు: ఒకప్పుడు రైతుకు బంగారు భవిష్యత్తు చూపిన పొగాకు సాగు ఇప్పుడు అప్పుల ఊబిలోకి నెడుతోంది. పెట్టుబడులు పెరిగినా.. దిగుబడులు బాగున్నా.. గిట్టుబాటు ధరల్లేక కర్షకులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారు. కిలోకు కనీసం రూ.350 కల్పించాలని ఫార్మర్స్, రైతు సంఘాలు నెలలుగా ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు చేపట్టినా, పరిస్థితిలో ఎలాంటి మార్పూ కానరావడంలేదు. వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటంతో వేలాది బేళ్లు రోజుల తరబడి పేరుకుపోతున్నాయి. ఆశించిన స్థాయిలో పర్చేజెస్‌ను సంస్థలు చేపట్టకపోవడంతో నోబిడ్ బేళ్ల సంఖ్యా పెరుగుతోంది. ఫలితంగా వీటిని నిల్వ చేయడం, వేలానికి మరోసారి తీసుకురావడంతో అదనపు భారాన్ని భరించాల్సి వస్తోంది. మంగళవారం నాటికి కేంద్రానికి 34,228 బేళ్లు రాగా, అందులో 26,972ను మాత్రమే కొనుగోలు చేశారు. నోసేల్‌గా ఐదు, నోబిడ్‌గా 5241, ఆర్‌ఆర్‌గా 541, సీఆర్ కింద 1012 నిలిచిపోయాయి. ఇలా మొత్తం 6799 విక్రయానికి నోచుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
పెట్టుబడేమో ఘనం.. ధరేమో శూన్యం
పొగాకు సాగు వ్యయం ఏటా పెరుగుతూనే ఉంది. నారు తయారీ మొదలుకొని చివరి దశ వరకు ఎరువులు, పురుగుమందులు, కూలీల వేతనాలు, నీటి ఖర్చులు, రవాణా, బ్యారెన్ నిర్వహణ, క్యూరింగ్‌కు అవసరమైన ఇంధనం.. ఇలా అన్ని వ్యయాలు భారీగా పెరిగాయి. కిలో పొగాకు ఉత్పత్తికి ప్రస్తుతం సుమారు రూ.250 వరకు ఖర్చవుతోంది. అయితే వేలంలో సగటు ధర రూ.196.16గానే నమోదవుతోంది. ప్రభుత్వం అదనంగా రూ.20ను ప్రోత్సాహకంగా ఇచ్చినా, రైతు చేతికి చేరేది సుమారు రూ.216 మాత్రమే. అంటే ప్రతి కిలోపై రూ.30 నుంచి రూ.40 వరకు నష్టపోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ఒక్కో బ్యారెన్‌పై రూ.మూడు లక్షల నుంచి రూ.నాలుగు లక్షల వరకు నష్టం తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలం కేంద్రంలో ఇప్పటి వరకు 37,52,475.30 కిలోల పొగాకును విక్రయించగా.. రూ.81,33,96,170.60 వ్యాపారం జరిగింది. కిలోకు గరిష్టంగా రూ.250.. కనిష్టంగా రూ.160 మాత్రమే లభించింది. ఈ రేట్లు ఉత్పత్తి వ్యయానికి ఏ మాత్రం సరిపోవడంలేదని రైతులు పేర్కొంటున్నారు.
ధర్నాలు చేపట్టినా స్పందనేదీ..?
వేలం కేంద్రాల వద్ద ధర్నాలను రైతులు, రైతు సంఘాల నేతలు కొద్ది వారాలుగా చేపట్టారు. కిలోకు కనీసం రూ.350 వచ్చేలా చర్యలు చేపట్టడం, కొనుగోలు సంస్థలపై పొగాకు బోర్డు ఒత్తిడి తీసుకురావడం, నోబిడ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయినా ఆశించిన మార్పు లేకపోవడం గమనార్హం.
అప్పుల ఊబిలో..
పొగాకు సాగు కోసం బ్యాంకులు, ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసిన రైతులు ఇప్పుడు వాటినెలా తీర్చాలనే ఆందోళనలో ఉన్నారు. వేలం ఆలస్యం కావడంతో వడ్డీ భారం రోజురోజుకూ పెరుగుతోందని పేర్కొంటున్నారు. పరిస్థితి ఇదే తరహాలో కొనసాగితే వచ్చే ఏడాది పొగాకు సాగుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రేట్ల కోసం ఉద్యమించినా..
దక్కని గిట్టుబాటు
కనీసంగా రూ.350 ఇవ్వాలనే డిమాండ్ బుట్టదాఖలు
సగటు ధర రూ.196.16కే పరిమితం
పెరిగిన సాగు వ్యయం..
మందగించిన కొనుగోళ్లు
ఆక్షన్ కేంద్రాల్లో పేరుకుపోతున్న బేళ్లు


