‘పాలిటెక్నిక్‌’లో వసతులపై భగ్గుమన్న విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

‘పాలిటెక్నిక్‌’లో వసతులపై భగ్గుమన్న విద్యార్థులు

Aug 5 2026 12:06 AM | Updated on Aug 5 2026 12:06 AM

సంఘీభావం తెలిపిన

ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి

సీఎస్సార్‌ నిధులతో

అభివృద్ధి అంటూ పబ్లిసిటీ స్టంట్‌

కళాశాల ఎదుట విద్యార్థుల ధర్నా

ప్రిన్సిపల్‌తో మాట్లాడుతున్న చంద్రశేఖర్‌రెడ్డి

నెల్లూరు (టౌన్‌): వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్‌ కళాశాలలో నెలకొన్న సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని, వీటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కాలేజీ ఎదుట వందలాది మంది విద్యార్థులు మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకొని వీరికి సంఘీభావాన్ని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి తెలియజేశారు. సమస్యలపై విద్యార్థులను ఆరాతీశారు. వీటిని పరిష్కరించేంత వరకు పోరాడతామని స్పష్టం చేశారు. తాగునీరు అపరిశుభ్రంగా ఉండటాన్ని గుర్తించి వారిని అడిగి వివరాలను తెలుసుకున్నారు. కాలేజీలో ప్రహరీ లేకపోవడంతో బయటి వ్యక్తులు లోపలికొచ్చి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ దృష్టికి తీసుకొచ్చారు. పెచ్చులూడుతున్న తరగతి గదులు, నాసిరకం భోజనం, చీకటి పడితే పాములొస్తున్న విషయాన్ని ప్రిన్సిపల్‌ రామారావుకు తెలియజేశారు. సమస్యలను ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

నాడంతా సాఫీగా..

గత ప్రభుత్వ హయాంలో నాడు – నేడుతో అన్ని పాఠశాలలు, కళాశాలలను అభివృద్ధి చేసిన ఘనత అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశలో 20 వేల స్కూళ్లు, కాలేజీలను ఆధునికీకరించిన అంశాన్ని గుర్తుచేశారు. రెండో దశలో 18 వేల స్కూళ్లలో పనులు 80 శాతం మేర పూర్తయ్యాయని, అయితే కూటమి ప్రభుత్వం కొలువుదీరాక వీటిని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. సర్కారీ బడుల్లో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేస్తే, నూతన ప్రభుత్వమొచ్చాక నిర్వహణ లేక అవి పాడైపోయాయని ధ్వజమెత్తారు. కనీస ఖర్చుతో వీటిని బాగుచేసి తాగునీటిని అందించాలనే కనీస బాధ్యత లేకపోవడం బాధాకరమన్నారు. నాడు – నేడు పేరును మనబడి – మన భవిష్యత్తుగా మార్చడం మినహా రూపాయి నిధులను సైతం విడుదల చేయలేదని ధ్వజమెత్తారు. విద్యార్థులు, యువతను మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలకు గతంలో మంచిపేరుండేదని, అయితే ఇప్పుడా పరిస్థితి లేకపోవడం విచారకరమని చెప్పారు. కలుషిత నీటిని తాగుతూ విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని, ఇదే పరిస్థితి నెల్లూరు నగర నియోజకవర్గంలోని అనేక విద్యా సంస్థల్లో నెలకొందని తెలిపారు. పార్టీ విద్యార్థి విభాగ నగర నియోజకవర్గ అధ్యక్షుడు తౌఫిక్‌, డివిజన్ల ఇన్‌చార్జీలు మహేష్‌యాదవ్‌, మహబూబ్‌బాషా, వెంగళ్‌రెడ్డి, మస్తాన్‌, రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ బాలకృష్ణారెడ్డి, విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షుడు ఆశ్రిత్‌రెడ్డి, నగరాధ్యక్షుడు చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పాలిటెక్నిక్‌ కళాశాలలో విద్యార్థులకు కనీస వసతులను కల్పించలేరానని చంద్రశేఖర్‌రెడ్డి ప్రశ్నించారు. సీఎస్సార్‌ నిధులతో పాఠశాలలను అభివృద్ది చేస్తున్నామంటూ రాష్ట్ర మంత్రులు లోకేశ్‌, నారాయణ పబ్లిసిటీకే పరిమితమవుతున్నారని విమర్శించారు. వీటితో నెల్లూరులో ఒకట్రెండింటిని డెవలప్‌ చేసి గొప్పలు చెప్పుకొంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల దుస్థితి వీరికి కనిపించడంలేదానని ప్రశ్నించారు. క్షేత్రస్థాయికొచ్చి వాస్తవ పరిస్థితులపై మాట్లాడాలని డిమాండ్‌ చేశారు.

కనీస వసతులను కల్పించలేరా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement