నెల్లూరు(అర్బన్): జిల్లాలో మాతృ మరణాలు సంభవించకుండా వైద్యశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని డీఎంహెచ్‌ఓ సుజాత పేర్కొన్నారు. సంతపేటలోని జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో మాతృ మరణాల నివారణ సబ్ కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. మినగల్లుకు చెందిన ఓ మహిళ గర్భ సమయంలో ఎందుకు మృతి చెందిందనే వివరాలను సంబంధిత డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడారు. జిల్లాలో మహిళలు గర్భం దాల్చిన వెంటనే ఆశ వర్కర్, అంగన్‌వాడీ కార్యకర్త ద్వారా తెలుసుకొని వివరాలను ఏఎన్‌ఎం రిజిస్టర్ చేయాలని సూచించారు. కాన్పు జరిగేంత వరకు పౌష్టికాహారం అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. బీపీ ఉన్న గర్భిణులను జిల్లా కేంద్రంలోని పెద్దాస్పత్రికి రెఫర్ చేయాలన్నారు. జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి పరిమళ, డీఐఓ బ్రిజిత, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ మాధవి, గైనకాలజిస్ట్ మేరీ స్నిగ్థ, డాక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
గీత దాటితే వేటే
● కలెక్టర్ హిమాన్షు శుక్లా
● కలెక్టరేట్లో గేట్లేసి మరీ ఆకస్మిక తనిఖీలు
నెల్లూరు(అర్బన్): కలెక్టరేట్‌కు కొంత మంది ఉద్యోగులు సమయపాలన పాటించకుండా ఇష్టారాజ్యంగా వస్తున్నారని, వీరిపై వేటు తప్పదని కలెక్టర్ హిమాన్షు శుక్లా హెచ్చరించారు. కార్యాలయానికి మంగళవారం ఉదయం పదింటికి ఆయన వచ్చారు. వెంటనే ఆఫీస్ లోపలికొచ్చే గేట్లకు తాళమేయించారు. గేట్ వద్ద సెక్యూర్టీని ఉంచారు. అనంతరం వివిధ సెక్షన్లను పరిశీలించారు. సమయానికి విధుల్లోకి రాని వారు పేర్లను నోట్ చేసుకున్నారు. విషయం తెలిసిన కొందరు ఉద్యోగులు హడావుడిగా వచ్చినా, గేట్లకు తాళాలేసి ఉండటంతో బయటే ఉండిపోయారు. ఆపై తాళాలు తీయించి.. సకాలంలో విధులకు హాజరుకాని వారిని ఒక్కొక్కరిగా తన చాంబర్‌లోకి పిలిపించి క్లాస్ పీకారు. తొలి తప్పుగా భావించి వదిలేస్తున్నానని, మరోసారి జరిగితే ఉపేక్షించేదిలేదని స్పష్టం చేశారు.
నేటి నుంచి టెట్
నెల్లూరు (టౌన్): ఏపీ టెట్ బుధవారం ప్రారంభం కానుంది. ఈ నెల 16 వరకు నిర్వహించనున్న ఈ పరీక్షలకు జిల్లాలో ఆరు కేంద్రాలను ఏర్పాటు చేశారు. నెల్లూరు రూరల్ పరిధిలోని పొట్టేపాళెం సమీపంలో గల అయాన్ డిజిటల్ సెంటర్, జై శ్రీరామ్ ఇన్‌ఫ్రా అండ్ ఐటీ సొల్యూషన్స్, కావలిలోని విశ్వోదయ, నెల్లూరు, గూడూరులోని నారాయణ, కోవూరు సమీపంలోని గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాలల్లో పరీక్ష జరగనుంది. రోజూ ఉదయం 9.30 నుంచి 12 వరకు.. మధ్యాహ్నం 2.30 నుంచి ఐదు వరకు నిర్వహించనున్న టెస్ట్‌కు 12,387 మంది హాజరుకానున్నారు. గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు. హాల్ టికెట్‌తో పాటు ఫొటో గుర్తింపు కార్డును తప్పక చూపాల్సి ఉంటుంది.
శ్రీవారి దర్శనానికి
15 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 30 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 78,561 మంది సోమవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. టైమ్ స్లాట్ టికెట్లున్న వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 15 గంటల సమయం పడుతోంది.
జొన్నవాడలో హుండీ కానుకల లెక్కింపు
బుచ్చిరెడ్డిపాళెం: జొన్నవాడలోని మల్లికార్జునస్వామి కామాక్షితాయి దేవస్థానంలో హుండీ కానుకలను లెక్కించారు. ఈ ఏడాది మే 18 నుంచి సోమవారం వరకు ప్రధాన హుండీల ద్వారా రూ.47,01,330 నగదు వచ్చిందని అధికారులు తెలిపారు. యూఎస్ డాలర్లు 20, చైనా యువాన్లు, నేపాల్ రూపాయి పది చొప్పున వచ్చాయని వివరించారు. 90 గ్రాముల బంగారు, 191 గ్రాముల వెండి వస్తువులున్నా యని వెల్లడించారు. అన్నప్రసాద హుండీలో రూ.2,33,771 మేర సమర్పించారు. దేవదాయ శాఖ కోవూరు పర్యవేక్షణాధికారి నాగ మల్లేశ్వరరాజు, ఆలయ చైర్మన్ అశోక్‌రెడ్డి, ఈఓ వెంకటశ్రీనివాసులురెడ్డి, ధర్మకర్త మండలి స భ్యుడు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


