నెల్లూరు రూరల్: డీఎస్సీలో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. చిల్డ్రన్స్ పార్కు సమీపంలోని శ్రీ కన్వెన్షన్ సమావేశ మందిరంలో యువత, డీఎస్సీ అభ్యర్థులతో మంగళవారం నిర్వహించిన టౌన్ హాల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మెగా డీఎస్సీలో జరిగిన అవినీతి, అక్రమాలకు బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి పదవికి లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలని పేర్కొన్నారు. డీఎస్సీ అభ్యర్థులను వంచించి పోస్టులకు అమ్ముకొని, నిరుద్యోగుల జీవితాలను రోడ్డుపైకి ఈడ్చారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి హామీని నేటికీ నెరవేర్చకుండా మోసం చేశారని మండిపడ్డారు. ప్రశ్నపత్రాల తయారీ, అప్‌లోడింగ్, డిజిటల్ నిర్వహణ వంటి అత్యంత రహస్యమైన విధులను అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి చేతుల్లో పెట్టి లీకేజీకి అవకాశం కల్పించారని విమర్శించారు. న్యాయం జరిగేంత వరకూ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.


