భూమి కోసం నాలుగు దశాబ్దాలుగా పోరాడిన ఓ రైతు కుటుంబం.. చివరకు న్యాయం కోసం కాదు, చావుకు అనుమతివ్వండని కోరుతూ కలెక్టర్ ఎదుట చేతులు జోడించింది. కాళ్లరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా, డజన్ల కొద్దీ వినతిపత్రాలు సమర్పించినా తమ గోడు వినిపించుకోలేదని ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ‘మా భూమిని కాపాడలేకపోతే.. కారుణ్య మరణానికి అనుమతించండి’ అంటూ చేసిన వేడుకోలు ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతలపై ప్రశ్నలు సంధించింది. ఒక కుటుంబం తన భూమిని కాపాడుకునేందుకు లక్షలు ఖర్చు పెట్టి, చివరకు బతకడమే భారమైందని చెప్పుకునే పరిస్థితి ఏర్పడడం జిల్లాలో తీవ్ర చర్చకు దారితీసింది.
నెల్లూరు (అర్బన్): భూమిని కాపాడాల్సిన వ్యవస్థ కనికరించకపోవడంతో ఓ రైతు కుటుంబం బతికే హక్కు పై ఆశ వదిలేసింది. నాలుగు దశాబ్దాలుగా తమదేనంటున్న భూమిని కాపాడుకునేందుకు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగామని, కలెక్టరేట్‌లోనే 46 సార్లు వినతిపత్రాలు ఇచ్చినా న్యాయం దక్కలేదని కారుణ్య మరణానికై నా అనుమతించమంటూ సోమవారం కలెక్టర్ హిమాన్షు శుక్లాను కలిసి వేడుకోవడం కలెక్టరేట్‌లో విషాద వాతావరణాన్ని నెలకొల్పింది. తమ భూమిని కాపాడుకునే పోరాటంలో ఇప్పటికే రూ.11 లక్షలు అప్పులపాలయ్యామని, ఇక చావు తప్ప మరో దారి కనిపించడం లేదంటూ కన్నీరు మున్నీరైంది. ఈ భావోద్వేగ విషయం కలెక్టరేట్‌లో చర్చనీయాంశంగా మారింది. జలదంకి మండలం కొత్తపాళెం గ్రామానికి చెందిన లోకిరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి కలెక్టరేట్‌లో కలెక్టర్‌కు అర్జీ ఇచ్చిన తర్వాత తన కుటుంబ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తమ కుటుంబం బుచ్చిరెడ్డిపాళెంలో ఉంటుంది. తమ కుటుంబానికి కలిగిరి మండలంలో 12.02 ఎకరాల పట్టా భూమి 1975 సంవత్సరం నుంచి ఉందన్నారు. తమ భూమి ఆనుకుని 8 ఎకరాల అసైన్డ్ భూమి ఉందన్నారు. అయితే కొంత మంది వ్యక్తులు ఆ అసైన్డ్ భూములకు కలిగిరి తహసీల్దార్ సాయంతో దొంగ పట్టాలు సృష్టించి సాగు చేసుకుంటున్నారన్నారు. తర్వాత తమ పట్టా భూమిపై వారి కన్ను పడిందన్నారు. తమ భూమిని కూడా ఆక్రమించుకుంటున్నారన్నారు. ఈ విషయంలో గతంలో పని చేసిన ఓ తహసీల్దార్‌కు అర్జీలు ఇవ్వగా ఆయన సర్వేయర్‌ను తీసుకు వచ్చి కొలతలు వేసి తమ భూమిలోకి రావద్దని కబ్జాదారులను హెచ్చరించాడన్నారు. దీంతో తమ జోలికి రాబోమని అసైన్డును ఆక్రమించుకున్న కబ్జాదారులు లిఖిత పూర్వకంగా రాసిచ్చారన్నారు. కొంత కాలం తర్వాత మళ్లీ ఆక్రమణదారులను తమ భూమిని సాగు చేసుకోకుండా అడ్డు పడుతున్నారన్నారు. ప్రస్తుత తహసీల్దార్ కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నాడని ఆరోపించారు. తహసీల్దార్ మా పంటను ధ్వంసం చేయించారని, సీసీ కెమెరాలను పగులగొట్టించారని ఆరోపించారు. తహసీల్దార్ తమను చిత్రహింసలు పెట్టిస్తున్నారన్నారు. పోలీసులు, తహసీల్దార్ ఆక్రమణదారుల వైపు నిలబడడంతో తాము ఇప్పటికే రూ.11 లక్షలు నష్టపోయామన్నారు. అప్పుల పాలయ్యామన్నారు. ఇదే విషయమై కలెక్టరేట్‌లో 46 సార్లు వచ్చి అర్జీలు ఇచ్చినా న్యాయం జరగలేదన్నారు. కాబట్టి తమకు చావే పరిష్కారమన్నారు. కలెక్టర్ స్పందించి వారం రోజుల్లో న్యాయం చేస్తామని తెలిపారన్నారు. ఈ వారంలోపు న్యాయం జరగకపోతే తాము సామూహికంగా ఆత్మహత్య చేసుకుంటామని తెలిపారు.
భూమిని కాపాడలేకపోతే చంపేయండి
మా భూమి కోసం రూ.11 లక్షల
ఖర్చు పెట్టుకున్నాం
కలెక్టరేట్‌లో 46 సార్లు అర్జీలిచ్చినా.. న్యాయం జరగట్లేదు
కలెక్టర్‌ను వేడుకున్న బాధిత
రైతు కుటుంబం
న్యాయం జరగకపోతే
సామూహిక ఆత్మహత్యలే శరణ్యం


