సంగం: ఆర్టీసీ బస్సులో పోగొట్టుకున్న రూ.4 లక్షల నగదు ఉన్న బ్యాగును సంగం పోలీసులు శనివారం గంటల వ్యవధిలో గుర్తించి బాధితురాలికి అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. కడప నుంచి నెల్లూరుకు వస్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న భవాని అనే మహిళ రూ.4 లక్షల నగదు ఉన్న బ్యాగు కనపడకపోవడంతో కంగారు పడి బుచ్చిరెడ్డిపాళెంలో దిగింది. వెంటనే ఆర్టీసీ సిబ్బందిని ఆశ్రయించింది. వారి సూచనల మేరకు సంగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా సంగంలో ఆరుగురు ప్రయాణికులు బస్సు నుంచి దిగుతూ పొరపాటున ఆ మహిళ బ్యాగును తీసుకెళ్లినట్లు గుర్తించారు. సదరు వ్యక్తులు ఆ బ్యాగ్ తమది కాదని సంగంలో వదిలి వెళ్లిపోయారు. టెంకాయల వ్యాపారి కృష్ణ అందించిన సమాచారంతో హోంగార్డులు అంకమ్మ, వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకుని బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. రూ.4 లక్షల నగదు ఉన్నట్లు నిర్ధారించి బాధితురాలికి అప్పగించారు.


