వంటకు ఇండక్షన్‌ టెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

వంటకు ఇండక్షన్‌ టెన్షన్‌

Aug 2 2026 12:16 AM | Updated on Aug 2 2026 12:16 AM

చిల్లకూరు: కూటమి ప్రభుత్వం అంగన్‌వాడీలకు ఇండక్షన్‌ స్టౌల రూపంలో కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది. అంగన్‌వాడీల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్లుగా ప్రకటిస్తూ వంట గ్యాస్‌ సిలిండర్ల సరఫరాను పూర్తిగా నిలిపివేసింది. పశ్చిమాసియాలో యుద్ధవాతావరణం కారణంగా గ్యాస్‌కు కొరత ఏర్పడడాన్ని సాకుగా చూపుతూ ప్రత్యామ్నాయంగా విద్యుత్‌ ఆధారిత ఇండక్షన్‌ స్టౌలను పంపిణీ చేసింది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తే అంగన్‌వాడీల పరిస్థితి పొయ్యిలో నుంచి పెనంపై పడినట్లుగా తయారైంది. కరెంట్‌ పోతే ఇండక్షన్‌ స్టౌలు పనిచేయకపోతుండడంతో వంటకు ఆటంకం ఎదురవుతోందని, విద్యుత్‌ బిల్లులు తడిసిమోపెడవుతున్నాయని అంగన్‌వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కరెంట్‌ పోతే వంట బంద్‌

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు విడతల వారీగా ఇండక్షన్‌ స్టౌలను పంపిణీ చేయడం ఆరంభించింది. ఈ నెలతో స్టౌల పంపిణీని పూర్తి చేసింది. ఇకపై జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యుత్‌ ఆధారిత ఇండక్షన్‌ స్టౌలపైనే వంట చేసి పోషకాహారం వడ్డించాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా అస్తవ్యస్తంగా ఉంటుంది. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ముందస్తు సమాచారం లేకుండానే కరెంట్‌ సరఫరా నిలిపివేస్తున్నారు. సరిగ్గా చిన్నారులకు వంట చేసే సమయంలో విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తుండడంతో సకాలంలో పిల్లలకు భోజనాలు వడ్డించలేక అంగన్‌వాడీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వంట పాత్రలతోనూ అగచాట్లే

గ్యాస్‌ స్టౌపైన అయితే ఏ పాత్రలైనా పనిచేస్తాయి. ఇండక్షన్‌ స్టౌపై అన్ని పాత్రలు పనిచేయవు. ఇండక్షన్‌ బేస్‌ లేదా అడుగు భాగంలో కాపర్‌ ఉన్న పాత్రలు మాత్రమే ఉపయోగించాలి. గ్యాస్‌ స్టౌపై ఎంత పెద్ద పాత్రలైనా పెట్టి వంట చేసే వారు. ఇండక్షన్‌ స్టౌలపై భారీ పాత్రలు పెట్టి వంట చేసే పరిస్థితి లేకపోవడంతో అంగన్‌వాడీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు స్టౌవ్‌పై వంట చేస్తున్న సమయంలో సరఫరా నిలిచిపోతే మళ్లీ కట్టెల పొయ్యిలపై కుస్తీ పట్టాల్సిందేనని అంగన్‌వాడీలు వాపోతున్నారు. మరోవైపు ఇండక్షన్‌ స్టౌలు పాడైతే గ్రామీణ ప్రాంతాల్లో మరమ్మతులు చేసే నాథుడే లేడు. పట్టణాలకు తీసుకెళ్లి బాగు చేయించాలంటే కనీసం రెండు, మూడు రోజులు పడుతుంది. ఆ సమయంలో పిల్లల ఆకలి ఎలా తీర్చాలని అంగన్‌వాడీలు ప్రశ్నిస్తున్నారు.

అందని బిల్లులు

గతేడాది నుంచి అంగన్‌వాడీ కార్యకర్తలకు వంటచెరుకు బిల్లులను అందజేయడాన్ని ఐసీడీఎస్‌ పూర్తిగా మరిచిపోయింది. ఏడాదిగా గ్యాస్‌ సిలిండర్లు నిలిపివేసిన ఐసీడీఎస్‌.. కేంద్రంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి రూ.0.24 పైసలు చొప్పున వంటచెరుకు ఖర్చులు చెల్లిస్తామని ప్రకటించింది. అయితే నేటికి కూడా బిల్లులు అందజేయలేదు. అయినా అంగన్‌వాడీలు తమ ఇంట్లో బిడ్డలకే వడ్డిస్తున్నామనుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

విద్యుత్‌ బిల్లుల భారం

ఇండక్షన్‌ స్టౌలు పంపిణీ చేసిన తరువాత ప్రతి అంగన్‌వాడీ కేంద్రానికి విద్యుత్‌ బిల్లుల కోసం నెలకు రూ.500 ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే అంగన్‌వాడీ కేంద్రంలో ఒక ఫ్యాన్‌, ట్యూబ్‌లైట్‌ ఉంటే నెలకు కనీసం రూ.400 నుంచి రూ.500 వరకు బిల్లు వస్తుంది. ప్రస్తుతం ఇండక్షన్‌ స్టౌపై వంట చేస్తే రోజుకు కనీసం అరగంట పాటు వినియోగిస్తే విద్యుత్‌ బిల్లులు తడిసి మోపెడవుతాయని, వాటిని తామే చెల్లించుకోవాలంటే కష్టమవుతుందని అంగన్‌వాడీ కార్యకర్తలు వాపోతున్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్‌ ఇచ్చిన రీతిలో అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా ఉచిత విద్యుత్‌ను అందించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

జిల్లాలో ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌లు – 12

అంగన్‌వాడీ కేంద్రాలు – 2,934

చిన్నారులు – 1.17 లక్షల మంది

బాలింతలు – 11,850 మంది

గర్భిణులు – 14,600 మంది

పంపిణీ చేసిన

ఇండక్షన్‌ స్టౌలు – 2934

గ్యాస్‌ సిలిండర్లు ఏమైనట్లు?

గతంలో జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు వంట గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేసేవారు. ఇందుకు గాను ఆయా కేంద్రాల్లో పని చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తల పేరుతో సిలిండర్లు బుక్‌ చేసి డెలివరీ చేసేవారు. నేడు ఆ పరిస్థితి లేదు. గతేడాది నుంచి గ్యాస్‌సిలిండర్లను సరఫరా చేయడం లేదు. గ్యాస్‌ సిలిండర్లను బుక్‌ చేయకపోతే ఏజెన్సీలు కనెక్షన్లను రద్దు చేశాయా లేక కార్యకర్తలే సొంతానికి వినియోగించుకుంటున్నారా అనే విషయం కూడా గోప్యంగా ఉంచేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 2,934 గ్యాస్‌ సిలిండర్లు ఏమయ్యాయనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

అంగన్‌వాడీ కేంద్రాలకు స్టౌల పంపిణీ

గ్యాస్‌ సరఫరా పూర్తిగా నిలిపివేత

కరెంట్‌ పోతే వంటకు ఆటంకాలు

తడిసిమోపెడవుతున్న విద్యుత్‌ బిల్లులు

పట్టించుకోని ఐసీడీఎస్‌ అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement