సాగరమాల... సాగతీత | - | Sakshi
Sakshi News home page

సాగరమాల... సాగతీత

Aug 1 2026 12:16 AM | Updated on Aug 1 2026 12:16 AM

నత్తనడకన సాగుతున్న జాతీయ రహదారి పనులు

పరిహారం పంపిణీలో జాప్యం

అడ్డంకులతో నిలిచిన నిర్మాణం

2027 నాటికై నా పూర్తవుతుందా?

ప్రమాదాలకు నిలయంగా

వరగలి క్రాస్‌రోడ్డు

చిల్లకూరు: కృష్ణపట్నం పోర్టు నుంచి జాతీయ రహదారికి అనుసంధానంగా చిల్లకూరు, కోట, నాయుడుపేట మండలాల మీదుగా నాలుగు లేన్ల రహదారి నిర్మాణాన్ని సుమారు రూ.1,000 కోట్ల వ్యయంతో చేపట్టారు. కాంట్రాక్టర్లు ముందుగా స్థానికులకు రోడ్డు ఎలా వస్తుందనే విషయాలను తెలియజేయకుండా చేపట్టడంతో పలు ప్రాంతాల్లో అడ్డంకులు ఎదురవుతున్నాయి. వరగలి క్రాస్‌రోడ్డు నుంచి తూర్పు కనుపూరు వరకు నిర్మించాల్సిన నాలుగు లేన్ల రహదారి పనులు ఈ కారణాలతో తీవ్రంగా ఆలస్యమవుతున్నాయి. ముత్యాలపాడు – పారిచెర్లవారిపాళెం మధ్య వర్షాకాలంలో ఉప్పుటేరు పొంగి రోడ్డుపైకి ఐదడుగుల మేర నీరు చేరుతుందనే విషయాన్ని ముందుగానే గుర్తించకుండా పనులు ప్రారంభించారని స్థానికులు పేర్కొంటున్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రైతులు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తికి వినతి అందజేయగా, ఆయన కేంద్ర మంత్రితో మాట్లాడి వంతెన నిర్మాణానికి చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఇతర ప్రాంతాల్లో కూడా తలెత్తిన సమస్యలను సకాలంలో పరిష్కరించకపోవడంతో నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.

పరిహారం ఎక్కడ?

వరగలి క్రాస్‌రోడ్డు నుంచి తూర్పు కనుపూరు వరకు 36 కిలోమీటర్లు, అక్కడి నుంచి నాయుడుపేట వరకు మరో 34 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారి నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసి 2024లో పనులు ప్రారంభించి ఏడాదిలోపు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. అయితే రెండేళ్లు గడిచినా పనులు పూర్తికాకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ రహదారి చిల్లకూరు, కోట మండలాల్లోని సుమారు 24 గ్రామాల మీదుగా వెళ్తుంది. పలుచోట్ల పట్టా భూములు సేకరించినప్పటికీ యజమానులకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో పరిహారం అందకపోవడంతో నిర్మాణ పనులు నిలిచిపోయిన ప్రాంతాలున్నాయి. భూసేకరణ సమస్యలు పరిష్కారం కాకపోవడం కూడా పనుల జాప్యానికి ప్రధాన కారణంగా మారింది.

ఎన్నో ప్రమాదాలు

సాగరమాల ప్రాజెక్ట్‌లో భాగంగా జాతీయ రహదారి నుంచి వరగలి మీదుగా తీర ప్రాంతానికి భారీ వాహనాలు సులభంగా రాకపోకలు సాగించేలా వరగలి క్రాస్‌రోడ్డు వద్ద ఫ్లై ఓవర్‌ నిర్మిస్తున్నారు. ఈ పనుల కారణంగా రెండు వైపులా అప్రోచ్‌ రోడ్ల ద్వారా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. దీంతో రహదారి ఇరుకుగా మారి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. సాయంత్రం వేళల్లో వాహనాల రద్దీ అధికంగా ఉండటంతో ట్రాఫిక్‌ గంటల తరబడి నిలిచిపోతోంది. రాత్రి సమయాల్లో దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు అప్రోచ్‌ రోడ్డును గుర్తించలేక ప్రమాదాలకు గురవుతున్నారు.

అప్పటికి పూర్తవుతుందా?

ప్రభుత్వం తొలుత ఈ ప్రాజెక్ట్‌ను 2025 డిసెంబరు నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యంతో 2027 చివరి నాటికై నా పూర్తవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం దృష్టి సారించి త్వరగా పనులు జరిగేలా చర్యలు తీసుకోవాల్సింది.

వరగలి క్రాస్‌రోడ్డు వద్ద పనులు నిలిచిపోయిన ఫ్లై ఓవర్‌ పనులు

జాతీయ రహదారిపై నత్తనడకన సాగుతున్న కల్వర్టు నిర్మాణం

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సాగరమాల రహదారి ప్రాజెక్ట్‌ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. కృష్ణపట్నం పోర్టును బెంగళూరుతో అనుసంధానించే ఈ రహదారి నిర్మాణం అంతులేని జాప్యానికి గురవుతుండటంతో చిల్లకూరు మండలంలోని వరగలి క్రాస్‌రోడ్డు ప్రమాదాలకు కేంద్రంగా మారింది. ఫ్లై ఓవర్‌ నిర్మాణం కొనసాగుతుండటంతో తాత్కాలిక అప్రోచ్‌ రోడ్లపై వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ఈ క్రమంలో తరచూ ప్రమాదాలకు జరుగుతున్నాయి.

పార్లమెంట్‌లో ప్రస్తావిస్తా

పోర్టులను అనుసంధానం చేసేలా రూపుదిద్దుకుంటున్న సాగరమాల రహదారి పనులు నత్తనడకన సాగుతున్న విషయాన్ని చిల్లకూరు, కోట మండలాలకు చెందిన ఆయా గ్రామాల ప్రజలు నా దృష్టికి తెచ్చారు. అలాగే నిర్మాణ సంస్థ ఆయా గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు అవసరమైన సర్వీస్‌ రోడ్డు ఏర్పాటు చేయడంలోనూ, బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ఆలస్యం చేస్తోంది. ఈ విషయాలపై ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రస్తావిస్తా. పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపడతా.

– మద్దిల గురుమూర్తి, ఎంపీ, తిరుపతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement