నిమ్మ రైతులకు గిట్టుబాటు ధరలు అందించేందుకు ఈసారి పూత దశనే మార్చే దిశగా అధికారులు, శాస్త్రవేత్తలు కసరత్తు ప్రారంభించారు. జూలైలో చెట్లకు పూత రాకుండా, అక్టోబరులో పూత వచ్చేలా శాసీ్త్రయ పద్ధతుల్లో మందులు పిచికారీ చేస్తే ఫిబ్రవరి సీజన్‌ సమయంలో దిగుబడి లభించి రై | - | Sakshi
Sakshi News home page

నిమ్మ రైతులకు గిట్టుబాటు ధరలు అందించేందుకు ఈసారి పూత దశనే మార్చే దిశగా అధికారులు, శాస్త్రవేత్తలు కసరత్తు ప్రారంభించారు. జూలైలో చెట్లకు పూత రాకుండా, అక్టోబరులో పూత వచ్చేలా శాసీ్త్రయ పద్ధతుల్లో మందులు పిచికారీ చేస్తే ఫిబ్రవరి సీజన్‌ సమయంలో దిగుబడి లభించి రై

Jul 31 2026 1:15 AM | Updated on Jul 31 2026 1:15 AM

పొదలకూరు : ఏటా నిమ్మ ధరలు జూదంగా మారుతున్నాయి. ధరలు ఉంటే.. కాయలు ఉండక, కాయలు ఉంటే.. ధరలు ఉండక రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. సాధారణంగా ఉద్యాన పంటల్లో ప్రతి పంటకు ఒక సీజన్‌ ఉంటుంది. కానీ జిల్లాలో నిమ్మ అన్‌ సీజన్‌లోనే అత్యధిక దిగుబడులు వస్తుండగా అన్‌ సీజన్‌లో తక్కువగా దిగుబడులు వస్తున్నాయి. ఫలితంగా మార్కెట్లో ధరలు ఉండక రైతులు ఆర్థికంగా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో పూత దశను శాసీ్త్రయంగా మార్పు చేసి.. సీజన్‌లో కాయల దిగుబడి వచ్చే విధంగా ఉద్యాన శాస్త్రవేత్తలు, అధికారులు సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. భవిష్యత్‌లో దీని ఫలితాలు ధరల ఆశలను రేకెత్తిస్తున్నాయి.

జిల్లాలో 30 వేల ఎకరాల్లో సాగు

నెల్లూరు జిల్లాలో ఉద్యాన పంటల కింద నిమ్మతోటలు సుమారు 30 వేల ఎకరాల్లో సాగవుతున్నాయి. ఒక్క పొదలకూరు మండలంలోనే 10,700 ఎకరాల్లో నిమ్మ సాగవుతున్నట్టు ఉద్యానాధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో నిమ్మకు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో మాత్రమే ధరలు ఉంటాయి. మిగిలిన మాసాల్లో గిట్టుబాటు ధరలు కూడా లభించడం కష్టంగా ఉంటుంది. వాతావరణం అనుకూలించకపోతే కిలో నిమ్మకాయలు రూ.20లకు అమ్మడం కూడా ఇబ్బందిగా మారుతోంది. గతేడాది నవంబరు, డిసెంబరు మాసాల్లో కిలో నిమ్మ కాయలు రూ.10 నుంచి రూ.15 మాత్రమే ధరలు పలికి రైతులు తీవ్రంగా నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు, ఉద్యానాధికారులు రైతులు తోటల సాగును మార్చుకుంటే సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా దృష్టికి తీసుకువచ్చారు. కలెక్టర్‌ జేసీ ద్వారా మార్కెటింగ్‌, ఉద్యానాధికారులు కలిసి రైతులకు అవగాహన కల్పించాల్సిందిగా ఆదేశించారు.

తోటల్లో పూత దశల్లో మార్పు చేసే పద్ధతి

నిమ్మ రైతులు నష్టపోకుండా ఉండాలంటే తోటల్లో చెట్లకు పూత దశల్లో మార్పులు చేసుకుంటే చాలా వరకు నష్ట నివారణ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలతోపాటు ఉద్యానాధికారులు వెల్లడించారు. ఫలితంగా జూన్‌, జూలై మాసాల్లో చెట్లకు పూత పూస్తే నవంబరు, డిసెంబరులో దిగుబడి వచ్చి రైతులు నష్టపోతారని, ఇందుకోసం ఈ మాసాల్లో పూతరాకుండా మందులను పిచికారీ చేసుకోవాలంటున్నారు. అక్టోబరులో తిరిగి పూత వచ్చేందుకు మందులను పిచికారీ చేసుకుంటే ఫిబ్రవరిలో ధరలు పలికే సీజన్లో కాయలు దిగుబడినిచ్చి రైతులు నష్టపోకుండా ఉంటారని సూచించారు.

మందుల పిచికారీకి సూచనలు

జిబ్బరెల్లిక్‌ యాసిడ్‌ 500 పీపీఎంను 200 లీటర్ల నీటిలో 10 గ్రాములు కలిపి జూన్‌, జూలై మాసాల్లో పిచికారీ చేస్తే చెట్లు శాఖీయ పెరుగుదల ఉంటుందన్నారు. రెండో పర్యాయం సెప్టెంబరులో సైకోసెల్‌ 1000 పీపీఎం, లెహోసిన్‌ 2 మి.లీ/లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తే పెరుగుదల నియంత్రించేందుకు ఉపయోగ పడుతుందన్నారు. మూడో దశ అక్టోబరులో 13:00:45 ను 10 గ్రాముల లీటర్‌ నీటిలో పిచికారీ చేస్తే చెట్ల పూతను ప్రేరేపిస్తుందన్నారు.

నిమ్మ సాగులో

సీజన్‌ మార్చే ప్రయత్నం

నవంబరు, డిసెంబరులో దిగుబడితో

గిట్టుబాటు కాని ధరలు

జూలైలో పూత రాకుండా, అక్టోబరులో పూత వచ్చేందుకు మందుల పిచికారీ

శాస్త్రవేత్తలు, ఉద్యానాధికారుల కృషి ఫలితాలపై సందేహాలు

జిల్లాలో 30 వేల ఎకరాల్లో

నిమ్మ తోటల సాగు

జూన్‌లో పిచికారీ చేస్తే మంచిది

సాధారణంగా జూన్‌లో తాము సూచించిన మందులను చెట్లకు పిచికారీ చేస్తే మంచిది. ఇప్పుడు సమయం మించిపోయినట్టుగా ఉంటుంది. ఇప్పటి వరకు పూత రాని రైతులు సెప్టెంబరు, అక్టోబరు మాసంలో పూత వచ్చేందుకు సైకోసెల్‌ పిచికారీ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రతి ఏడాది జూన్‌ నుంచే పూత లేకుండా ఉండేందుకు జిబ్బరెల్లిక్‌ యాసిడ్‌ను పిచికారీ చేసుకోవాలి.

– ఆనంద్‌, ఉద్యానాధికారి, పొదలకూరు

జూలైలో పూత రాలేదు

జూలై నెలలో చెట్లకు పూత రాలేదు. సెప్టెంబరులో, అక్టోబరులో పూత వచ్చేందుకు ఉద్యానాధికారులు వెల్లడించిన విధంగా మందులను పిచికారీ చేసి చూడాలి. ఇప్పటి వరకు ఇలాంటి విధానం రైతులకు తెలియదు. ప్రయోగాత్మకంగా ఉన్నందున పిచికారీ చేసి చూసి ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకుంటాం.

– జీ నారాయణరెడ్డి, రైతు, పులికల్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement