నెల్లూరు(వేదాయపాళెం): నగరంలోని పొదలకూరు రోడ్డులో గల బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న వసతి, భోజన సౌకర్యాలను మెరుగుపర్చే చర్యలను ఐటీడీఏ అధికారులు ప్రారంభించారు. తమకు పెట్టే అన్నంలో పురుగులుంటున్నాయని.. నీళ్ల సాంబార్‌ను పోస్తున్నారంటూ అక్కడి ఫిర్యాదుల పెట్టెలో తమ సమస్యను విద్యార్థులు తెలియజేశారు. ఈ క్రమంలో బాలల హక్కుల కమిషన్ రాష్ట్ర చైర్మన్ సూర్యనారాయణరాజు అక్కడ పరిశీలించి ప్రిన్సిపల్, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులను మందలించి.. ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాలని చెప్పారు. ఈ తరుణంలో దిద్దుబాటు చర్యలను ఐటీడీఏ అధికారులు ప్రారంభించారు. పాఠశాలలో అందుతున్న రక్షణ, వసతి, భోజన సదుపాయాలను పరిశీలించాల్సిందిగా డీటీడబ్ల్యూఓ సుజాత, అడ్మినిస్ట్రేటివ్ మానిటరింగ్ ఆఫీసర్ శాంతిని పీఓ శ్రీనివాసరావు ఆదేశించారు. అక్కడ పరిస్థితులను పరిశీలించి, నివేదికలను ఉన్నతాధికారులకు అందజేయనున్నారు.
నాలుగు నుంచి
జుడాల సమ్మె
నెల్లూరు(అర్బన్): జూనియర్ డాక్టర్లకు స్టయ్‌పండ్‌ను పెంచడంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆగస్ట్ నాలుగు నుంచి సమ్మె చేయనున్నామని ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (జుడా) జిల్లా అధ్యక్షుడు హనీష్ తెలిపారు. స్టయ్‌పండ్ సవరణ తక్షణమే జరగకపోతే ఆ రోజు నుంచి విధులను బహిష్కరించి సమ్మె చేస్తామంటూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్.. వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీస్‌ను విజయవాడలో ఏపీ జుడాల సంఘ ఆధ్వర్యంలో గురువారం అందజేశారు. ఈ క్రమంలో నగరంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆయన మాట్లాడారు. అతి తక్కువ స్టయ్‌పండ్‌తో పనిచేస్తూనే అధికారులకు పలుమార్లు వినతిపత్రాలను సమర్పించామని చెప్పారు. చివరి అవకాశంగా చూస్తామని, అప్పటికీ స్పందించకపోతే సమ్మె తప్పదని స్పష్టం చేశారు.
ఇంటి స్థలాల
ఆక్రమణలపై సర్వే
చిట్టమూరు: మండల పరిధి లోని నార్త్ వరత్తూరు గ్రామంలో గిరిజనుల ఇంటి స్థలాలను రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి ఆక్రమణలను తొలగించి బాధితులకు హద్దులు చూపి అప్పగించారు. ‘యథేచ్ఛగా ఇంటి స్థలాల ఆక్రమణ’ అనే శీర్షికన సాక్షిలో గురువారం ప్రచురితమైన కథనానికి తహసీల్దార్ రామయ్య స్పందించారు. సర్వేయర్ శ్రీకాంత్, వీఆర్వో వెంటకరమణను గ్రామానికి పంపి ఇంటి స్థలాల వద్ద సర్వే నిర్వహించి హద్దులు చూపించారు. అలాగే మరోసారి ఆక్రమణలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
యువజన విభాగ
రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా
రజత్‌కుమార్‌రెడ్డి
కోవూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాజీ మంత్రి, పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తనయుడు రజత్‌కుమార్‌రెడ్డిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటనను గురువారం విడుదల చేసింది. ఆయన నియామకంపై కోవూరు నియోజకవర్గంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఆయనకు అభినందనలను తెలియజేశారు. పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని కాంక్షించారు.
శ్రీవారి దర్శనానికి
12 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గురువారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయి.. శిలాతోరణం వద్దకు క్యూ చేరుకుంది. స్వామివారిని 74,471 మంది బుధవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 35,361 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.68 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టిక్కెట్లున్న వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టిక్కెట్లు గల వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.


