లోకేశ్‌ రాజీనామా చేసేంత వరకూ పోరాటం ఆగదు | - | Sakshi
Sakshi News home page

లోకేశ్‌ రాజీనామా చేసేంత వరకూ పోరాటం ఆగదు

Jul 31 2026 1:15 AM | Updated on Jul 31 2026 1:15 AM

డీఎస్సీ నియామక ప్రక్రియ,

స్పోర్ట్స్‌ కోటాలో అక్రమాలు

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

నెల్లూరు (పొగతోట): విద్యాశాఖ మంత్రి పదవికి లోకేశ్‌ రాజీనామా చేసేంత వరకు తమ పోరాటం ఆగదని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో గురువారం ఆయన మాట్లాడారు. డీఎస్సీ నియామక ప్రక్రియలో స్పోర్ట్స్‌ కోటాలో అక్రమాలు, అవకతవకలు జరిగాయని, దీనికి లోకేశ్‌ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. మీ హయాంలో విద్యాశాఖ విఫలమైందని, దీనికి సమాధానాలను చెప్పలేకపోతున్నారని విమర్శించారు. లోకేశ్‌ స్థాయికి తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి రావాల్సిన అవసరం లేదని... ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డిని పంపుతామని, ఆయన సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగితే.. విద్యాశాఖ మంత్రిగా కొనసాగేందుకు అర్హుడివేనని ఎద్దేవా చేశారు. కనీసం క్రీడా మైదానంలో అడుగు పెట్టనివారికి, ఆట చేతగాని వారికి సైతం డీఎస్సీలో ఉద్యోగం లభించిందని మండిపడ్డారు. దొడ్డిదారిన కోటాలు పెంచడం, జీఓలను జారీ చేయడం, పోస్టులను భర్తీ చేయడంపై తాము ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పడంలేదని ధ్వజమెత్తారు. డీఎస్సీని కనుగొన్నది టీడీపీ అనే విధంగా ఊదరగొట్టేందుకు, ఎదురుదాడి చేసేందుకు సిగ్గుండాలన్నారు.

కలెక్టర్‌కు వినతిపత్రం నేడు

డీఎస్సీలో అవకతవకలపై కలెక్టరేట్‌కు శనివారం తమ పార్టీ ఆధ్వర్యంలో వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రాన్ని సమర్పించనున్నామని చెప్పారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై తీవ్ర ఆరోపణలొచ్చిన తరుణంలో రాజీనామా చేశారని, అయితే రాష్ట్రంలో లోకేశ్‌ రిజైన్‌ చేయకుండా సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగ యువత, విద్యార్థులకు అన్యాయం జరిగిందని, దీనిపై మేధావులు, విద్యావేత్తలు, కోచింగ్‌ నిర్వాహకులతో కలిసి సదస్సులను నిర్వహించనున్నామని వెల్లడించారు. ఆ తర్వాత నియోజకవర్గాల వారీగా ర్యాలీలు, రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, నిరసన కార్యక్రమాలను చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచనున్నామని చెప్పారు.

మోసాలపై ఛీదరిస్తున్న ప్రజలు

స్థానిక సంస్థల ఎన్నికలను జరపాలనే నిర్ణయంతో రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరిట కరపత్రాలు పట్టుకొని ప్రజలకు ముఖం చూపించలేక.. ఒకవేళ చూపిస్తే ఛీదరించుకోవడంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారని ఎద్దేవా చేశారు. అమరావతిలోని సచివాలయంలో చంద్రబాబు, లోకేశ్‌ కూర్చొని, రోజూ ఒక గ్రామానికి ఎమ్మెల్యే వెళ్లాలనే నిబంధన పెట్టారని చెప్పారు. ఆ కాగితాలతో ఊళ్లలోకెళ్తే తలుపులు మూసేసే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. గ్రామం, ప్రజలకు ఏమి చేశామో చెప్పుకోలేక ఎమ్మెల్యేలు పాట్లు పడుతున్నారని చెప్పారు. ప్రతి పథకంలో లబ్ధిదారుల సంఖ్యకు కోతేస్తున్నారని మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు పేరుతో బస్సుల్లో తీవ్ర తోపులాటలు జరుగుతున్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కండక్టర్లు, డ్రైవర్లు సైతం సమస్యను తాళలేక తాము తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ఉద్యోగులు తీవ్ర మానసిక ఆందోళన, ఆగ్రహావేశాలకు గురవుతున్నారని తెలిపారు. మాయమాటలు చెప్పి అన్ని వర్గాలను మోసం చేసిన విధంగానే ఉద్యోగులను కూడా ప్రభుత్వం వంచించిందని మండిపడ్డారు.

పొగాకు రైతులపై నిర్దయ

గిట్టుబాటు ధరల్లేవంటూ రోడ్డెక్కి నిరసనను పొగాకు రైతులు తెలియజేస్తుంటే, పోలీసుల్ని వారిళ్ల వద్దకు పంపి బయటకొస్తే కేసులు పెడతామని బెదిరించడం దారుణమన్నారు. ఎవరైనా వస్తే వారిపై కేసులు నమోదు చేయడాన్ని దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. తమ ప్రభుత్వ హయాంలో సంగం వద్ద రైతులు ధర్నా చేయగా, వారిపై అప్పటి ఎస్పీ కేసు నమోదు చేస్తే, ఆ అంశం అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి దృష్టికి వెళ్లిందని, అదే రోజు సాయంత్రానికల్లా వీటిని విత్‌డ్రా చేయించిన అంశాన్ని గుర్తుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement