కదం తొక్కిన కార్మికులు | - | Sakshi
Sakshi News home page

కదం తొక్కిన కార్మికులు

Jul 31 2026 1:15 AM | Updated on Jul 31 2026 1:15 AM

కనీస వేతనంగా

రూ.26 వేలివ్వాలని డిమాండ్‌

సీఐటీయూ ఆధ్వర్యంలో

భారీ ర్యాలీ, ధర్నా

నెల్లూరు(అర్బన్‌): కనీస వేతన చట్టం మేరకు రూ.26 వేల జీతాన్ని అవుట్‌సోర్సింగ్‌, ఆప్కాస్‌ కార్మికులకు అమలు చేయడంతో పాటు వీరిని క్రమబద్ధీకరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రసాద్‌, గోగుల శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. కనీస వేతనాన్ని అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనమివ్వాలనే డిమాండ్‌తో ట్రంక్‌ రోడ్డు, వీఆర్సీ కూడలి మీదుగా కలెక్టరేట్‌ వరకు భారీ ప్రదర్శనను కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, అవుట్‌సోర్సింగ్‌, ఆప్కాస్‌, షెడ్యూల్డ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ కార్మికులు.. సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన ధర్నాలో నేతలు మాట్లాడారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ విధానాలను తెచ్చి కార్మికుల కడుపుగొట్టింది చంద్రబాబేనని మండిపడ్డారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వీరు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ పేరుతో వీరితో 12 నుంచి 15 గంటల మేర సర్కార్‌ పనిచేయించుకుంటోందని ఆరోపించారు. ఓటీ చేయించుకున్నా అదనంగా జీతాలివ్వడంలేదని, అయినా పెట్టుబడిదారులకే గవర్నమెంట్‌ అండగా ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలో కార్మిక వేతన సవరణ జరిగి 15 ఏళ్లు దాటినా పట్టించుకోవడంలేదని విమర్శించారు. కాంట్రాక్ట్‌, ఆప్కాస్‌, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులకు జీతాలను ఏడేళ్లుగా పెంచలేదని ధ్వజమెత్తారు. పరిశ్రమల అధిపతులు అతి తక్కువ వేతనాలను చెల్లిస్తున్నా, అడిగే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. జీతాలను పెంచకపోతే పోరాటాలను ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ధర్నాకు మద్దతుగా ఎల్‌ఐసీ ఏఓఐ, కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎం అసోసియేషన్‌, పెద్దాస్పత్రిలోని ఆప్కాస్‌, మున్సిపల్‌ పారిశుధ్య కార్మిక సంఘాల తరఫున కార్యకర్తలు బ్యానర్లు ప్రదర్శించారు. వీరి వద్దకు డీఆర్వో విజయ్‌కుమార్‌ వచ్చి వినతిపత్రాన్ని స్వీకరించి.. డిమాండ్లను ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, పెంచలనరసయ్య, రెహనాబేగం, అల్లాడి గోపాల్‌, గడ్డం అంకయ్య, సతీష్‌కుమార్‌, సురేష్‌ రాజా, ఎల్‌ఐసీ ఏఓఐ రాష్ట్ర నేతలు మేకల నరసింహరావు, హజరత్‌రెడ్డి, ఆప్కాస్‌ జేఏసీ నేత చేమూరు రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement