నెల్లూరు(బృందావనం): గురుపూర్ణిమ మహోత్సవాలను పురస్కరించుకుని బాలాజీనగర్ చివర పద్మావతి నగర్‌లోని సాయిదర్బార్ అద్దాల మందిరంలో మూడో రోజు గురువారం శ్రీసాయి సచ్ఛరిత్ర అఖండ పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సాయినాథుని స్మరిస్తూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పారాయణం గా వించారు. శాస్త్రోక్తంగా సాయినాథుడికి అభిషేకార్చనలు, పూజలు జరిపారు. విశేషాలంకారంలో కొలువైన షిరిడీ వాసుడ్ని భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆ మందిర మేనేజింగ్ ట్రస్టీ మధుసాయి మాట్లాడుతూ శ్రీసాయి సచ్చరిత్ర నిత్య పారాయణంతో సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుందన్నారు. కార్యక్రమాలను అద్దాల మందిరం గౌరవ సలహాదారు పాబోలు రామసుబ్బయ్య, శ్రీసాయిదర్బార్ భజన, సత్సంగ సేవాదళ్ సభ్యులు, భక్తబృందం పర్యవేక్షించింది.
ఆగస్టు 2వ తేదీ ఉదయం 9 గంటలకు సాయిమాత నిత్య అన్నప్రసాదాలయం ద్వారకామాయిలో మెగా ఉచిత నేత్ర వైద్య శిబిరం జరుగనుందని, బాలాజీనగర్, ఏసీనగర్ పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మధుసాయి గురువారం కోరారు. డాక్టర్ పీఎల్‌రావు మోడరన్ ఐ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ వైద్యబృందం సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.
2న నేత్ర వైద్య శిబిరం


