నెల్లూరు (టౌన్): జిల్లా క్యారమ్ సంఘం సహకారంతో శుక్రవారం నుంచి వచ్చేనెల 2వ తేదీ వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ర్యాంకింగ్ క్యారమ్ టోర్నమెంట్–2026ను నెల్లూరు క్లబ్‌లో నిర్వహించనున్నట్లు ఆ సంఘ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ జలీల్, టోర్నమెంట్ కమిటీ కో–చైర్మన్ మలిరెడ్డి కోటారెడ్డి తెలిపారు. దర్గామిట్టలోని నెల్లూరు క్లబ్‌లో టోర్నమెంట్ నిర్వహణపై ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 15 జిల్లాల నుంచి 200 మంది క్రీడాకారులు టోర్నమెంట్‌లో పాల్గొననున్నట్లు చెప్పారు. చీఫ్ రిఫరీగా డీఎస్సార్ మూర్తి, అసిస్టెంట్ రిఫరీగా ఎస్కే సాజిదా వ్యవహరిస్తారన్నారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారుడు సీహెచ్ జనార్దనరెడ్డి, క్రీడాకారిణి బి.శోభిక, గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్ ఎస్కే హుస్నా సమీరా తదితర క్రీడాకారులు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్ విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. నాకౌట్ విధానంలో పోటీలు జరుగుతాయని చెప్పారు. ఇక్కడి ర్యాంకింగ్ పాయింట్లు రాష్ట్ర జట్టు ఎంపికకు కీలకం కానున్నాయన్నారు. క్రీడాకారులకు భోజన, వసతి సౌకర్యాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో క్యారమ్ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీమన్నారయణ, కార్యదర్శి శ్రీనివాసులు పాల్గొన్నారు.


