ఎన్‌జీటీ ఆదేశాలు తుస్‌.. వరద ప్రవాహానికి అడ్డుకట్ట | - | Sakshi
Sakshi News home page

ఎన్‌జీటీ ఆదేశాలు తుస్‌.. వరద ప్రవాహానికి అడ్డుకట్ట

Jul 30 2026 12:33 AM | Updated on Jul 30 2026 12:33 AM

పెన్నమ్మ గుండెల్లో యంత్రాలు గర్జిస్తున్నాయి. అధికార యంత్రాంగాలు చేవ చచ్చి.. చేష్టలుడిగి చూస్తున్నాయి. జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌

(ఎన్‌జీటీ) విధించిన నిషేధాన్ని ధిక్కరించి ఇసుక మాఫియా వికటాట్టహాసం చేస్తోంది. పర్యావరణ నిబంధనలు గాలికి వదిలేసి ప్రకృతిని పణంగా పెట్టి నదిని చెరబట్టుతున్నారు. వరద ముప్పు, జిల్లా జలనిధి సోమశిల ప్రాజెక్ట్‌ భద్రత, ప్రజల ప్రాణాలు అన్నింటినీ పక్కన బెట్టి ధనార్జనే ధ్యేయంగా యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల కళ్ల ముందే వందలాది టిప్పర్లు తిరుగుతున్నా, రహదారులు ధ్వంసమవుతున్నా, నదిలోనే రహదారులు నిర్మిస్తున్నా, సంబంధిత శాఖలు మౌనం దాల్చాయి.

అనధికార ఇసుక రీచ్‌ నుంచి వెళ్లే వాహనాలతో ప్రధాన రహదారులు చిఽధ్రం అవుతున్నాయి. ఓవర్‌ లోడుతో వాహనాలు వెళ్తుండడంతో రోడ్లు కుంగిపోతున్నాయి. ఆ రోడ్లు సామర్థ్యానికి మించి లోడింగ్‌తో వెళ్తుండడంతో గుల్లగుల్లగా మారుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేల ధనదాహానికి రోడ్లు చిధ్రమయి ప్రజాజీవనానికి తీవ్ర ఆటంకం కలుగుతున్నా అధికారులకు చీమకుట్టినట్లు లేదు.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో టీడీపీ నేతల ధనదాహం.. అధికార యంత్రాంగాల అక్రమార్జనకు పెన్నమ్మ గర్భశోకంతో విలపిస్తోంది. పర్యావరణ పరిరక్షణ నిబంధనల్లో భాగంగా జూలై నుంచి అక్టోబరు వరకు మూడు నెలల పాటు నదుల్లో ఇసుక తవ్వకాలపై జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నిషేధం విధించింది. ఈ కాలంలో ఒక్క ట్రాక్టర్‌ కూడా నదిలోకి దిగకూడదనే నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ సోమశిల దిగువ కలువాయి నుంచి ఇందుకూరుపేట వరకు అడుగడుగునా భారీ యంత్రాలు పెట్టి నదీ గర్భాన్ని కుళ్ల బొడుస్తున్నారు. చట్టంలో ఉన్న ‘డీ–సిల్టింగ్‌’ వెసులుబాటును అడ్డు పెట్టుకుని పరిమిత అనుమతి ఉన్న ప్రాంతాన్ని దాటి ఓపెన్‌ రీచ్‌లు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా జిల్లాలోని కలువాయి మండలం రాజుపాళెం సమీపంలోని సోమశిల ప్రాజెక్ట్‌కు అతి సమీపంలోనే పర్యావరణ అనుమతుల్లేని ప్రాంతంలో తవ్వకాలు కొనసాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇసుక దందా ఆపే దమ్ము ఎవరికుందని టీడీపీ ఎమ్మెల్యేలు జిల్లా అధికార యంత్రాంగానికి సవాల్‌ విసురుతున్నారు.

నిషేధం.. అయినా మాకేం భయం

పర్యావరణ పరిరక్షణ సంస్థ జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలను టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు ధిక్కరించి పెన్నానదిలో అనధికార రీచ్‌లు ఏర్పాటు చేసుకుని రేయింబవళ్లు బహిరంగంగానే ఇసుక దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన రహదారుల వెంబడే ఇసుక వాహనాలు వెళ్తున్నాయి. రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన రహదారులను చిధ్రం చేస్తూ ఇసుక దందా సాగిస్తున్నారు. ఆ ఇసుక మాఫియాకు రాచబాటలు వేస్తూ అధికార యంత్రాంగాలు సాగిలపడి గులాంగిరి చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా జలనిధి సోమశిలకు దిగువన అతి సమీపంలో కి.మీ. దూరంలోని రాజుపాళెం సమీపంలో స్థానిక ప్రజాప్రతినిధి అండతో పెన్నానదిలో భారీ యంత్రాలు పెట్టి ఇసుక తోడేసి నిత్యం వందలాది టిప్పర్లు, టర్బోలారీల్లో తరలిస్తున్నారు. అక్కడ ఇసుక ఇసుక తవ్వకాలు చేపట్టకూడదనే నిబంధనలు ఉన్నాయి.

డీసిల్టింగ్‌ అనుమతే చట్టవిరుద్ధం

వాస్తవానికి నదిలో డీసిల్టింగ్‌ చేపట్టాలంటే.. నదిలో బ్యారేజీలకు ఎగువ ప్రాంతంలోనే అనుమతి ఇవ్వాల్సి ఉంది. ‘ఎద్దు ఈనిందంటే.. దూడను గాటన కట్టేయండి’ చందంగా టీడీపీ నేతలు దరఖాస్తు చేయడం, అధికారులు అనుమతి ఇచ్చేయడం చకచకా జరిగిపోయాయి. రాజుపాళెం సమీపంలో ఎటువంటి బ్యారేజీ లేదు. కానీ సంగం బ్యారేజీకి ఎగువ ప్రాంతంలో డీసిల్టింగ్‌ పేరుతో అనుమతులు తీసుకుని బ్యారేజీకి 50 కి.మీ. దూరంలోని రాజుపాళెం వద్ద ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. డీసిల్టింగ్‌ అనుమతి పేరుతో ఓపెన్‌ రీచ్‌నే నిర్వహిస్తున్నారు. నేరుగా నది మధ్యలో యంత్రాలు పెట్టి రేయింబవళ్లు ఇసుక తవ్వి రవాణా చేస్తున్నారు. ఒక్కో వాహనానికి రూ.12 వేలు వంతున వసూలు చేస్తున్నారు. రోజుకు సగటున 100 ఇక్కడి నుంచి ఇసుక రవాణా జరుగుతోంది. రోజుకు సరాసరిగా రూ.12 లక్షల రాబడిలో షాడో ఎమ్మెల్యేగా ఉన్న కీలక నేతకు రూ.8 లక్షలు, మిగిలిన సొమ్ము ఖర్చులతోపాటు తమ్ముళ్లకు పంపకాలు చేసుకుంటున్నారు. నిషేధం కాలంలో తమ్ముళ్లు బరితెగించి తవ్వకాలు చేస్తున్నా.. అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.

యంత్రాలతో తవ్వకాలు

కుల్లూరులో డంపింగ్‌

తెలుగురాయపురం అనధికార ఇసుక రీచ్‌ నుంచి సమీపంలో ఉన్న కుల్లూరు నేషనల్‌ హైవే (565) పక్కనే ఇసుకను డంపింగ్‌ చేస్తున్నారు. అక్కడి నుంచి విక్రయాలు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంత పక్కాగా బరితెగించి ఇసుక దందా చేస్తున్నా అధికారయంత్రాంగం కళ్లకు గంతలు కట్టుకున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

మాఫియా ఇసుక దందా అప్రతిహతం

కలువాయి మండలం రాజుపాళెంలో బరితెగిస్తున్న తమ్ముళ్లు

అక్టోబర్‌ 15 వరకు నిషేధాన్ని ధిక్కరించి ఇసుక తోడేస్తున్న తోడేళ్లు

అధిక లోడుతో టిప్పర్లతో గుల్లగుల్లగా రహదారులు

ప్రజాప్రతినిధులకు రూ. కోట్లలో

నెల మామూళ్లు

సోమశిల ప్రాజెక్ట్‌కు పొంచి ఉన్న ముప్పు

మామూళ్ల మత్తులో అధికారుల

కళ్లకు గంతలు

రోడ్లు గుల్ల చేస్తూ..

జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఆదేశాలను తమ్ముళ్లు పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ నేతల ఆదేశాలే చట్టాలుగా మార్చేశారు. నది మధ్యలో నుంచి ఇసుక రవాణాకు వీలుగా అడ్డంగా పట్టిష్టమైన రోడ్డు నిర్మాణం చేయడంతో స్థానిక గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఒక వేళ వర్షం కురిసి నీటి ప్రవాహం వస్తే అడ్డుకట్ట వల్ల గ్రామాల వైపు వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉంది. సమీప గ్రామాలు మునిగిపోయి ప్రాణ, ఆస్తి నష్టం కలిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. కానీ అధికార యంత్రాంగానికి మాత్రం మాఫియా ఇచ్చే కాసులతో ప్రజాజీవనానికి ముప్పు ఉందని తెలిసీ కూడా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement