బాలల సంక్షేమానికి ప్రత్యేక కార్యాచరణ | - | Sakshi
Sakshi News home page

బాలల సంక్షేమానికి ప్రత్యేక కార్యాచరణ

Jul 30 2026 12:33 AM | Updated on Jul 30 2026 12:33 AM

కలెక్టర్‌ హిమాన్షు శుక్లా

నెల్లూరు రూరల్‌: జిల్లాలో బాలల సంక్షేమానికి ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నామని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. బాలల పరిరక్షణ వ్యవస్థపై ఐసీడీఎస్‌, వైద్య, పోలీస్‌, సంక్షేమ శాఖల అధికారులతో సమీక్ష, అవగాహన సమావేశాన్ని కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై శాఖల వారీగా కమిషన్‌ చైర్మన్‌ సూర్యనారాయణరాజు, కమిషన్‌ సభ్యురాలు వెంకటపద్మలత, కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా హిమాన్షు శుక్లా మాట్లాడారు. పిల్లల సమగ్రాభివృద్ధికి ఐసీడీఎస్‌, వైద్య, విద్య, పోలీస్‌, కార్మిక శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. గిరిజనులు, అనాథ పిల్లల సంక్షేమానికి ప్రత్యేక చర్యలతో పాటు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రత్యేక తనిఖీలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణలో బాల కార్మికులుగా ఉన్న వారిని జిల్లాకు సురక్షితంగా తీసుకొచ్చి, వారిని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న నెట్‌వర్క్‌లపై చర్యలు చేపట్టామని వివరించారు. అనంతరం సూర్యనారాయణరాజు మాట్లాడారు. జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు, సంక్షేమ హాస్టళ్లలో గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దాలని సూచించారు. జిల్లాలను మూడ్నెల్లకోసారి సందర్శించి బాలల హక్కుల అమలుపై సమీక్షించనున్నామని ప్రకటించారు. అనంతరం వివిధ శాఖల అధికారులు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ను నిర్వహించారు. ఐసీడీఎస్‌ పీడీ హేనాసుజన్‌, జిల్లా బాలల సంరక్షణాధికారి సురేష్‌, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

1098కు సమాచారమివ్వండి

పిల్లల హక్కుల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదని, బాలలపై వేధింపులు, బాల కార్మిక వ్యవస్థ తదితరాలు ఎక్కడ జరిగినా వెంటనే 1098 చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌కు సమాచారమివ్వాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ రాష్ట్ర చైర్మన్‌ సూర్యనారాయణరాజు కోరారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పిల్లల్లో పెరుగుతున్న చెడు అలవాట్లు, సోషల్‌ మీడియా దుష్ప్రభావాలు, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు, చిన్నారులను నేర కార్యకలాపాలకు వినియోగించే ధోరణిపై కమిషన్‌ సభ్యులు, నిపుణులతో కలిసి విస్తృత అధ్యయనం చేసి సమగ్ర నివేదికను సిద్ధం చేశామని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి త్వరలోనే అందజేయనున్నామని వెల్లడించారు. సోషల్‌ మీడియా ప్రభావంపై పిల్లలు, తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించేలా రాష్ట్ర వ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నామని ప్రకటించారు. విద్యకు చిన్నారులు దూరం కాకుండా చర్యలు చేపట్టనున్నామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement