● బాధితులకు అండగా కాకాణి,
వైఎస్సార్సీపీ శ్రేణులు
● మూడు డిమాండ్లను నెరవేర్చాల్సిందే
మనుబోలు: పోలీసుల దాష్టీకంతో ప్రాణాలు కోల్పోయిన మండలంలోని చెరుకుమూడికి చెందిన బొల్లు ఏడుకొండలు (41) మృతదేహాన్ని శవ పంచనామా అనంతరం మనుబోలుకు బుధవారం సాయంత్రం తీసుకొచ్చారు. విషయం ముందుగా తెలియడంతో వందల సంఖ్యలో పోలీసులను హైవేపై మోహరించారు. పోలీస్‌స్టేషన్ వద్దకు స్థానికులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏడుకొండలు మృతికి పోలీసులే కారణమని, వారిని శిక్షించాలని కోరుతూ స్థానిక తహసీల్థార్ కార్యాలయ ఎదుట మృతదేహంతో హైవేపై కుటుంబసభ్యులు బైఠాయించారు. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేశారు. వీరిని చెదరగొట్టేందుకు ఖాకీలు యత్నించడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పందించి కార్యకర్తలను శాంతింపజేయడంతో పాటు డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావుతో చర్చలు జరిపారు.
న్యాయం జరిగేంత వరకూ పోరాటం
బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకూ వారి తరఫున తాము పోరాటం చేయనుందని కాకాణి పేర్కొన్నారు. తాము నిర్దిష్టంగా మూడు డిమాండ్లను పోలీసుల ముందుంచామని.. ఎవరైతే ఏడుకొండలు మృతికి కారణమో వారిపై చర్యలు చేపట్టడం, బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారాన్ని అందజేయడంతో పాటు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశామన్నారు. మృతికి కారణమైన వారిపై 15 గంటల్లోపు చర్యలు చేపడతామని డీఎస్పీ హామీ ఇచ్చారని తెలిపారు. ఇతర అంశాలను కలెక్టర్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని చెప్పారన్నారు.
దాటవేత ధోరణిలో ఎస్పీ
ఏడుకొండలు మృతిపై ఎస్పీ దాటవేత ధోరణిలో మాట్లాడారని కాకాణి విమర్శించారు. ముగ్గురు నిందితులను శని, ఆదివారాల్లో తీసుకొచ్చామని పోలీసులు చెప్తున్నారని, అయితే ఏడుకొండలు రాకపోవడంతో మాధవ్ అనే కానిస్టేబుల్ మంగళవారం స్వయంగా వెళ్లి ఈడ్చుకొచ్చే క్రమంలో ఆయన కాళ్లకై న బురద మరకలను తాము చూశామని చెప్పారు. న్యాయం చేయాలని, అలా కాకుండా లాకప్ డెత్‌కు కారణమైన పోలీసులను వెనుకేసుకొని రావడం న్యాయం కాదని డీఎస్పీకి సూచించారు. ఏడుకొండలును పట్టుకున్నప్పటి నుంచి మృతదేహాన్ని గూడూరు ఆస్పత్రికి తరలించేంత వరకూ సీసీ ఫుటేజీలను పోలీసులు బయటపెడితే నిజాలు నిగ్గు తేలుతాయని పేర్కొన్నారు. వారికి అనుకూలమైన వీడియోలను మాత్రమే బయటపెట్టి.. బాధితులను దొంగలుగా, తాగుబోతులుగా చిత్రీకరించడం తగదని హితవు పలికారు. దొంగైనంత మాత్రాన ఇక ఏమీ అవసరం లేకండా పోలీసులే కొట్టి చంపేస్తామంటే ఇక చట్టాలు, కోర్టులు ఎందుకని ప్రశ్నించారు. చంద్రబాబు అదే నమ్మితే కేంద్రంతో మాట్లాడి ఓ చట్టాన్ని తీసుకురావాలని ఎద్దేవా చేశారు. ఎస్పీకి తప్పుడు సమాచారమిచ్చి ఉంటారని, దీన్నంత తేలిగ్గా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని.. ప్రైవేట్ కేసును వేస్తామని.. జాతీయ ఎస్సీ కమిషన్, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నామని వెల్లడించారు. శవ పంచనామా మొక్కుబడిగా కుదరదని, వీడియోగా చేయాలని ఫొరెన్సిక్ నిపుణులను పిలిపించాలంటే సాయంత్రం వరకూ తాత్సారం చేశారని ఆరోపించారు. జిల్లాలోని పోలీసులందర్నీ పిలిపించి తమను అష్టదిగ్బంధనం చేసేందుకు యత్నించారని ధ్వజమెత్తారు. ఏడుకొండలు కుటుంబానికి న్యాయం జరిగేంత వరకూ దళిత, ప్రజా సంఘాలను కలుపుకొని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
జాతీయ రహదారిపై బాధితుల బైఠాయింపు
భారీగా పోలీసులు


