బుచ్చి మాజీ సీఐ సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

బుచ్చి మాజీ సీఐ సస్పెన్షన్‌

Jul 16 2026 5:36 AM | Updated on Jul 16 2026 5:36 AM

కోవూరు: బుచ్చిరెడ్డిపాళెం సీఐగా పని చేస్తూ వీఆర్‌కు బదిలీ అయిన మాతంగి శ్రీనివాసరావును సస్పెండ్‌ చేస్తూ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం మినగల్లుకు చెందిన వ్యవసాయశాఖాధికారి శ్రీహరిని అతని మేనల్లుడు, బావమరిది హరికృష్ణ గత నెల 15వ తేదీ హత్య చేసిన కేసును గుండెపోటు మరణంగా చిత్రీకరించడంలో సీఐ శ్రీనివాసరావు కీలకపాత్ర పోషించారనే ఆరోపణలు నేపథ్యంలో అతన్ని రేంజ్‌ వీఆర్‌కు బదిలీ చేశారు. అయితే ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో ఈ ప్రధాన నిందితుడు హరికృష్ణ మంగళవారం తన భార్య, ఇద్దరు బిడ్డలతో కలిసి సింగరాయకొండ రైల్వేస్టేషన్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో హడావుడిగా అతన్ని సస్పెండ్‌ చేసినట్లు బుధవారం బయటకు వచ్చింది. అయితే పోలీసులు మాత్రం నాలుగు రోజుల క్రితమే సస్పెండ్‌ చేసినట్లు చెబుతున్నారు.

బుచ్చిలో అచ్చిరాని

ఖాకీ కొలువులు

బుచ్చిరెడ్డిపాళెంలో రెండేళ్ల కాలంలో పోలీస్‌ శాఖలో ముగ్గురు సీఐలు, ఇద్దరు ఎస్సైలు మారారు. బుచ్చిరెడ్డిపాళెం పట్టణం విస్తరిస్తున్న నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలతో పోలీస్‌ శాఖ సమన్వయం కీలకంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో పోలీస్‌ అధికారుల తరచూ మార్పులు క్షేత్రస్థాయిలో ప్రభావం చూపే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కొత్తగా వచ్చే అధికారులు గత అధికారుల ప్రణాళికలు, కేసుల వివరాలు, స్థానిక సమస్యలను అధ్యయనం చేసేలోపే బదిలీలు జరిగితే వ్యవస్థలో వేగం తగ్గుతుందంటున్నారు. అయితే ఇదే కేసులోని ఎస్సైను వీఆర్‌కు బదిలీ చేసి చేతులు దులుపుకొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement