● ఎస్పీ అజిత వేజెండ్ల
నెల్లూరు(క్రైమ్): జిల్లాను డ్రోన్ కెమెరాల నిఘా నీడలోకి తీసుకొచ్చామని ఎస్పీ అజిత వేజెండ్ల పేర్కొన్నారు.నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో బుధవారం ఆమె మాట్లాడారు. ఈ ఏడాది ప్రథమార్థంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్‌లో 82 మార్కులతో ఏ గ్రేడ్‌ను సాధించామని చెప్పారు. గడిచిన ఆర్నెల్లో 37 మందిపై పీడీ.. పది మందిపై పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్, నేర ప్రవృత్తి ఉన్న 76 మందిపై సెక్సువల్ ఆఫెండర్ షీట్లను తెరిచి నిరంతర నిఘాను ఉంచామని వెల్లడించారు. ప్రజాభద్రతే ధ్యేయంగా 153 కార్డన్ సెర్చ్‌లను నిర్వహించామని పేర్కొన్నారు. నగరంతో పాటు కావలి, గూడూరు, ఆత్మకూరులో ప్రత్యేక బృందాలతో రాత్రి గస్తీని పటిష్టంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.
బుచ్చి కేసులో పూర్తిస్థాయిలో దర్యాప్తు
వ్యవసాయాధికారి శ్రీహరి హత్య కేసులో పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నామనీ, కేసులో ఇప్పటికే ఇద్దర్ని అరెస్ట్ చేశామన్నారు. కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బుచ్చిరెడ్డిపాళెం అర్బన్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్, ఎస్సైను వీఆర్‌కు పంపడంతో పాటు సిబ్బంది మొత్తాన్నీ బదిలీ చేశామన్నారు. శాఖాపరమైన చర్యల్లో భాగంగా వీఆర్‌లో ఉన్న ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారని చెప్పారు. ఆత్మహత్యల నివారణ చర్యల్లో భాగంగా ‘ఒక్క క్షణం ఆలోచించంది.. పోరాడి విజేతలుగా నిలవండి’ అంటూ ముద్రించిన పోస్టర్లను ఎస్పీ, పోలీస్ అధికారులు ఆవిష్కరించారు. ఏఎస్పీలు సౌజన్య, దీక్ష, నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్బీ, డీసీఆర్బీ, పీసీఆర్ ఇన్‌స్పెక్టర్లు దశరథరామారావు, శ్రీనివాసరెడ్డి, పాపారావు, భక్తవత్సలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


