అనుమతి లేదు.. అడ్డు చెప్పేదెవరు? | - | Sakshi
Sakshi News home page

అనుమతి లేదు.. అడ్డు చెప్పేదెవరు?

Jul 11 2026 12:24 AM | Updated on Jul 11 2026 12:24 AM

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గూడూరు నియోజకవర్గంలో ఖనిజ సంపద అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ముఖ్యంగా తెల్లరాయి (క్వార్ట్‌ ్జ), సిలికా, ఇసుక, గ్రావెల్‌ వంటి ఖనిజాలను అక్రమంగా తవ్వి తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా గనుల శాఖ, రెవెన్యూ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వంలో స్థానిక టీడీపీ నేతల అండదండలతో అక్రమ తవ్వకాలు మరింత పెరిగాయి. నియోజకవర్గంలోని పలు మండలాల్లో రెండేళ్లుగా ఖనిజ సంపద అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తెల్లరాయి తవ్వకాలను కట్టడి చేసినట్లు ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది.

2024లో లీజు ముగిసినా..

గూడూరు మండలం కందలి రెవెన్యూ పరిధిలోని ఓ తెల్లరాయి గనికి గతంలో 50 సంవత్సరాల లీజు మంజూరైంది. అది 2024 సంవత్సరం నవంబర్‌ నెలతో ముగిసింది. అనంతరం మరో 20 సంవత్సరాల పొడిగింపు కోసం దరఖాస్తు చేసి, దీనిని అడ్డం పెట్టుకుని స్థానిక టీడీపీ నేత అండదండలతో అక్రమంగా తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ఈ విషయంపై ఎవరైనా ప్రశ్నిస్తే, గతంలో తవ్విన గుంతలను మట్టితో పూడ్చే పనులు మాత్రమే చేస్తున్నామని, గని యాజమాన్యం చెబుతోంది. అయితే రాత్రివేళల్లో కొత్తగా తవ్వకాలు నిర్వహించి, మరోచోట నిల్వ చేసి అక్కడి నుంచి లారీల ద్వారా తరలిస్తున్నారు.

డెడ్‌ రెంట్‌ చెల్లించని వైనం

లీజు గడువు ముగిసిన తర్వాత కూడా సంబంధిత భూమికి, అదనంగా వినియోగించే ప్రాంతానికి డెడ్‌ రెంట్‌ చెల్లించాల్సి ఉంటుంది. అయితే అలాంటిది చేయకుండానే ఖాళీ భూముల్లో తవ్వకాలు కొనసాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై గనుల శాఖకు సమాచారం ఇచ్చినా, స్థానిక ప్రజాప్రతినిధి అండదండల కారణంగా అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. దీనికితోడు నెలవారీ మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

చెక్‌పోస్టులున్నా అక్రమ రవాణా

ఖనిజాల రవాణాకు రాయల్టీ చెల్లించాల్సి ఉండటంతో ఇటీవల ప్రభుత్వం వసూళ్ల బాధ్యతను ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పగించింది. వారు పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే కందలిలోని గని నుంచి గతంలో తవ్వి నిల్వ ఉంచిన తెల్లరాయిని తరలిస్తున్నామని చెబుతూ, ప్రస్తుతం అనుమతి లేకున్నా అక్రమంగా రవాణా కొనసాగిస్తున్నారు. ప్రైవేట్‌ ఏజెన్సీ చెక్‌పోస్టుల వద్ద స్థానిక నేత పేరు చెప్పి వాహనాలు వెళ్లిపోతున్నాయి. దీంతో ప్రభుత్వానికి, ఏజెన్సీకి రావాల్సిన ఆదాయం కూడా తగ్గుతోంది.

ప్రమాదం జరిగినా..

ఇటీవల కందలి గనిలో తెల్లరాయి లోడ్‌ చేస్తున్న సమయంలో క్రేన్‌కు కట్టిన గన్నీ బ్యాగ్‌ తెగిపడి ఓ కార్మికుడిపై పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే యాజమాన్యం స్థానిక ప్రజాప్రతినిధి సహకారంతో బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించి ఘటనను బయటకు రాకుండా చేశారనే ఆరోపణలున్నాయి.

ప్రభుత్వ భూమిలో..

లీజు గడువు ముగిసిన గని పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించి బాల్‌ మిల్లింగ్‌ పరిశ్రమ నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గనిలో లభించే తెల్లరాయిని అక్కడే పిండి చేసి ఎగుమతి చేసేందుకు దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నిర్మాణానికి రెవెన్యూ, గనుల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఎలాంటి అనుమతులు మంజూరైనట్లు రికార్డులు లేవని తెలుస్తోంది. అయినప్పటికీ ముఖ్య నేత అండతో పనులు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

టీడీపీ నేత అండతో తెల్లరాయి

అక్రమ తవ్వకాలు

రాయల్టీ వసూళ్లు ప్రైవేట్‌కు

అప్పగించినా కొనసాగుతున్న

అక్రమ రవాణా

కాలుష్య నియంత్రణ మండలి అనుమతి లేకుండానే పరిశ్రమ నిర్మాణం?

ఫిర్యాదులు వచ్చినా చోద్యం చూస్తున్న గనులు, రెవెన్యూ శాఖలు

ఫిర్యాదులు వచ్చినా..

కందలి గ్రామ సమీపంలోని గనిలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని రెవెన్యూ, గనుల శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు అందినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరోవైపు, గనుల శాఖ మాత్రం గతంలో తవ్వి నిల్వ ఉంచిన ఖనిజానికే రవాణా అనుమతులు ఇస్తున్నట్లు సమాచారం. అయితే 2024లోనే లీజు గడువు ముగిసిన గనిలో ఇంకా అంత పెద్ద ఎత్తున నిల్వలు ఎలా ఉన్నాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నా సంబంధిత శాఖల అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో గూడూరు నియోజకవర్గంలో ఖనిజ సంపద అక్రమ తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement