● చైన్నె నగర మెట్రో అధికారుల
బృందం వినతి
రాపూరు: చైన్నె నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు కండలేరు జలాల విడుదలను పెంచాలని ఆ నగర మెట్రో అధికారుల బృందం కండలేరు జలాశయ అధికారులను కోరింది. వారు శుక్రవారం కండలేరును జలాశయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కండలేరు జలాలు చైన్నె నగరానికి 200 క్యూసెక్కులు మాత్రమే చేరుతున్నాయని, 500 క్యూసెక్కులు చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం చైన్నెలో తాగునీటి అవసరం ఎక్కువగా ఉందని, కండలేరు హెడ్‌రెగ్యులేటర్ నుంచి నీటి విడుదలను పెంచితే 500 క్యూసెక్కులు చేరుతుందని తెలిపారు. తొలుత కండలేరు హెడ్ రెగ్యులేటర్‌ను పరిశీలించారు. అక్కడి నుంచి నీటి విడుదల వివరాలను తెలుసుకున్నారు. ప్రస్తుతం కండలేరులో 30.180 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలుగుగంగ ఎస్‌ఈ సుబ్రహ్మణ్యేశ్వరావు తెలిపారు. సత్యసాయి గంగ ద్వారా 2,000 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. నీటి విడుదల ప్రభుత్వ అధికారులతో చర్చించి వారి అనుమతితో చైన్నె నగరానికి నీరు విడుదలను పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో చైన్నె మెట్రో ఇంజినీరింగ్ డైరెక్టర్ పర్వీజ్, సీఈ వైదేహి, ఎస్‌ఈ శివకుమార్, కలై సెల్వన్, నందగోపాల్, తెలుగగంగ ఈఈ గజేంద్రరెడ్డి, డీఈఈ అనిల్‌బాబు, ఏఈ అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


