చలో జువ్వలదిన్నె రేపు | - | Sakshi
Sakshi News home page

చలో జువ్వలదిన్నె రేపు

Mar 19 2026 7:33 AM | Updated on Mar 19 2026 7:33 AM

ఫిషింగ్‌ హార్బర్‌ను ప్రైవేట్‌ పరం కాకుండా కాపాడుకుందాం

మత్స్యకారుల భవిష్యత్‌కు

అండగా నిలుద్దాం.. తరలిరండి

బిట్రగుంట: మత్స్యకారుల జీవితాలను ఉజ్వలం చేసేందుకు బోగోలు మండలం జువ్వలదిన్నెలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఫిషింగ్‌ హార్బర్‌ను దొడ్డిదారిన ప్రైవేట్‌ పరం చేస్తున్న టీడీపీ నేతల కుట్రలను ఎదుర్కొనేందుకు చలో జువ్వలదిన్నె కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహిస్తున్నట్లు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జువ్వలదిన్నెకు ఉత్తర, దక్షిణంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని తీర ప్రాంతాల మత్స్యకారులతో పాటు పార్టీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు. సముద్రంపైనే ఆధారపడి జీవనం సాగించే మత్స్యకారులకు భరోసా కల్పించేందుకు.. ఉపాధి కోసం చైన్నె, గుజరాత్‌, మంగుళూరు వంటి దూరప్రాంతాలకు వలస వెళుతున్న మత్స్యకార యువకులకు స్థానికంగానే ఉపాధి కల్పించే లక్ష్యంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం చేపట్టారన్నారు. దీని ద్వారా ఒక మత్స్యకారులకే కాకుండా వేలాది మందికి ఇతరులకు పరోక్షంగా ఉపాధి లభిస్తుదన్నారు. శరవేగంగా నిర్మాణం పూర్తి చేయించారని, ఎన్నికలు రావడంతో వాయిదా పడిందన్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఫిషింగ్‌ హార్బర్‌ను వర్చువల్‌గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించినప్పటికీ మత్స్యకారులకు అంకితం చేయకుండా, కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ ప్రయత్నాల ద్వారా వారి నోట్లో మట్టికొట్టే యత్నం చేస్తోందన్నారు. హార్బర్‌లో ప్రైవేట్‌ వ్యక్తులకు పెత్తనం అప్పగిస్తే స్థానిక మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. తీరంపై ప్రైవేట్‌ పెత్తనాన్ని అడ్డుకునే లక్ష్యంతో చలో జువ్వలదిన్నెకు శ్రీకారం చుట్టామని తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డితో పాటు పలువురు జిల్లా నేతలు పాల్గొననున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement