సంగం: మండలంలోని సంగం సమీపంలో ఉన్న కావలి కాలువలో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించి వివరాలు సేకరించారు. మృతుడిని సంగం తిరమణతిప్ప ఎస్టీ కాలనీకి చెందిన కొమరగిరి పెంచలయ్యగా గుర్తించారు. మృతి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
రైలు కిందపడి
వ్యక్తి ఆత్మహత్య
నెల్లూరు(క్రైమ్): ఆర్థిక విభేదాలో?, కుటుంబ కలహాలో?, ఇతర కారణాలో తెలియదుగానీ చైన్నె టు పూరి ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో నెల్లూరు వైపు వెళ్లే పట్టాలపై సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మృతుడు సుమారు 5.4 అడుగుల ఎత్తు ఉన్నాడు. ఎరుపు రంగు గళ్ల ఫుల్ హ్యాండ్స్ చొక్కా, బులుగు రంగు గళ్ల లుంగీ ధరించి ఉన్నాడు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా తయారైంది. నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కండలేరులో
49.230 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 49.230 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,050, లోలెవల్ కాలువకు 200, హైలెవల్ కాలువకు 255, పిన్నేరు కాలువకు 50, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తి దుర్మరణం
గూడూరురూరల్: ఎల్‌ఐసీ కార్యాలయం సమీపంలోని రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. గూడూరు రూరల్ ఎస్సై తిరుపతయ్య కథనం మేరకు.. మనుబోలు మండలం కట్టువపల్లి గ్రామానికి చెందిన బత్తల ముత్యాలయ్య కుమారుడు చిన ముత్యాలయ్య అలియాస్ రఘు (35) గూడూరులోని ఆస్పత్రి రోడ్డులో ఉన్న ఓ ఫొటో ల్యాబ్‌లో పనిచేస్తున్నాడు. పట్టణంలోని గమళ్లపాళెం ప్రాంతంలో నివాసముంటున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మంగళవారం మధ్యాహ్నం వరకు అతను ల్యాబ్‌లో పనిచేసి యశ్వంత్ అనే స్నేహితుడితో కలిసి మోటార్‌బైక్‌పై జాతీయ రహదారి వైపు వెళుతున్నాడు. ఈ క్రమంలో ఎల్‌ఐసీ కార్యాలయం సమీపంలో ఆర్టీసీ బస్సును ఓవర్‌టేక్ చేయబోయారు. అదే సమయంలో ఎదురుగా నడిచి వస్తున్న ఓ వ్యక్తిని తప్పించబోయి ఢీకొనడంతో బైక్‌పై నుంచి ఇద్దరూ రోడ్డుపై పడ్డారు. వెనుక కూర్చొని రఘు అక్కడికక్కడే మృతిచెందాడు. యశ్వంత్‌కు స్వల్ప గాయాలయ్యారు. 108 అంబులెన్స్‌లో గూడూరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎస్సై కేసు నమోదు చేశారు. రఘు మృతి విషయం తెలిసి కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా రోదించారు.


