● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
వింజమూరు(ఉదయగిరి): మండలంలోని ఇందిరా నగర్ సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. మూలె జనార్దనరెడ్డి (39) సొంతూరు చేజర్ల మండలం నూతక్కివారికండ్రిక. వింజమూరు పట్టణంలోని యర్రబల్లిపాళెంలో వివాహం చేసుకుని కొన్నేళ్ల నుంచి ఇక్కడే కాపురముంటున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అతను హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సోమవారం ఉదయగిరికి కోర్టు పనుల నిమిత్తం వెళ్లి తిరిగి ఊరికి బైక్‌పై బయలుదేరాడు. నిద్రమత్తు కారణంగా వాహనం అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఇంటి పెద్ద మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఘటనా స్థలాన్ని కలిగిరి సీఐ వెంకటనారాయణ, ఏఎస్సై జయరావు పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు తరలించారు.
గ్యాస్ సమస్యల
పరిష్కారానికి కాల్ సెంటర్
నెల్లూరు(పొగతోట): గ్యాస్ సమస్యల పరిష్కారానికి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కార్యాలయంలో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో జాప్యం, అధిక ధరల వసూలు, బుకింగ్‌లో సమస్యలు ఉంటే వినియోగదారులు 94922 73897 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటారు.
భర్త వేధింపులు తాళలేక..
● వివాహిత ఆత్మహత్య
నెల్లూరు(క్రైమ్): భర్త తీరుతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు అనగుంటకు చెందిన ప్రతాప్, మహిత (20)లు దంపతులు. వారిది ప్రేమ వివాహం. కొద్దిరోజులు సజావుగా సాగిన కాపురంలో కలతలు చోటుచేసుకున్నాయి. భర్త తరచూ ఆమెను నల్లగా ఉన్నావు.. అందంగా లేవంటూ మానసికంగా వేధించడంతోపాటు కొడుతుండేవాడు. దీంతో గతేడాది సెప్టెంబర్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మహితను ఆమె పెద్దమ్మ వెంకటసుబ్బమ్మ తన వెంట కడపకు తీసుకెళ్లింది. కొంతకాలం తర్వాత ప్రతాప్ అక్కడికెళ్లి బాగా చూసుకుంటానని నమ్మించి భార్యను కాపురానికి తీసుకెళ్లాడు. అయినా అతని తీరులో మార్పురాలేదు. పదిరోజుల క్రితం మహిత తన పెద్దమ్మకు ఫోన్ చేసి భర్త తీరును వివరించి కన్నీటి పర్యంతమైంది. ఆదివారం మహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని వెంకటసుబ్బమ్మకు ప్రతాప్ ఫోన్ చేసి చెప్పా డు. ఆమె ఈ విషయాన్ని హైదరాబాద్‌లో ఉంటున్న మహిత అన్న మంజునాథ్‌కు తెలియజేసింది. అతను నెల్లూరుకు చేరుకుని సోదరి మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యాడు. వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహిత మృతికి ప్రతాప్ కారణమని అతడిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. సోమవారం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మా భూములు
మాకే ఇప్పించండి
● మోకాళ్లపై కూర్చుని పొదుపు
మహిళల నిరసన
కావలి రూరల్: మా భూములు మాకే ఇప్పించడంటూ కావలి మండలం చెన్నాయపాళెం పంచాయతీ పరిధిలోని పెద్దపట్టపుపాళేనికి చెందిన సుమారు 300 మంది పొదుపు మహిళలు సోమవారం వినూత్నంగా మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో గ్రామంలోని నిరుపేదలకు మహిళలకు ప్రభుత్వం భూములు మంజూరు చేసిందని తెలిపారు. అప్పట్లో నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో తాము గ్రామాన్ని వీడి బయట ప్రాంతాలకు వెళ్లామని చెప్పారు. ఆ సమయంలో కొందరు నాయకులు తమ భూములను ఆక్రమించుకుని వారి పేర్లపై అడంగళ్లు చేయించుకుని అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆక్రమణదారుల చెర నుంచి తమ భూములను విడిపించాలని కోరుతూ పోరాటం సాగిస్తున్నామని తెలియజేశారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందలేదని వాపోయారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. అధికారులు స్పందించకపోతే మరింత పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జి.రత్నమ్మ, ప్రళయకావేరి తిరుపతమ్మ, కాటంగారి నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.


