● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు
● ఎన్‌ఎంసీ కార్యాలయం ఎదుట మహా ధర్నా
నెల్లూరు(బారకాసు): కార్పొరేషన్ పరిధిలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, వాటి పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట మహా ధర్నా జరిగింది. తొలుత బారాషహీద్ దర్గా నుంచి ప్రజలతో కలిసి నాయకులు ర్యాలీగా బయలుదేరి కార్పొరేషన్ కార్యాలయం వద్దకు చేరుకుని అధికారుల నిర్లక్ష్యంపై నినాదాలు చేశారు. దీంతో అదనపు కమిషనర్ హిమబిందు వచ్చి ప్రజలు తీసుకొచ్చిన అర్జీలను స్వీకరించారు. ఎప్పటిలోగా సమస్యలు పరిష్కరిస్తారో హామీ ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. మూడు వారాల్లోగా పరిష్కరిస్తామన్నారు.
సమస్యలు గాలికి..
రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ మంత్రి నారాయణ అమరావతి జపం చేస్తూ ప్రజా సమస్యలు గాలికొదిలేశారన్నారు. నగరంలో ఏ వార్డులో చూసినా కుళాయిల్లో కలుషిత నీరు సరఫరా అవుతోందన్నారు. దోమలు స్వైర విహారం చేస్తున్నాయన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించలేని పాలకులు కోర్టు నోటీసులు, బెదిరింపులు, దౌర్జన్యాలతో పన్నులు వసూలు చేయడం, దానిని ఘనతగా చెప్పుకోవడం మంచిపద్ధతి కాదని హితవు పలికారు. నగరంలో 70 శాతానికి పైగా ఇళ్లకు రిజిస్ట్రేషన్ సౌకర్యం లేకపోవడం అత్యంత దారుణమన్నారు. ప్రజల నుంచి దౌర్జన్యంగా పన్నులు వసూలు చేసి ప్రైవేట్ ట్రాక్టర్లు, చెట్లు నాటే పేరుతో రూ.కోట్లను అధికార పార్టీ కార్యకర్తలు దోచుకుంటున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. 53, 54 డివిజన్ల పరిధిలో ప్రభుత్వ బ్యాంక్ ఏర్పాటు చేయాలన్నారు. కాలువ కట్టలపై ఉన్న నిరుపేద దళితుల ఇళ్లను దౌర్జన్యంగా తొలగించే చర్యలు ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నేతలు కత్తి శ్రీనివాసులు, జి.నాగేశ్వరరావు, షేక్ మస్తాన్‌బీ, పి.సూర్యనారాయణ, నరసింహ, కత్తి పద్మ, మూలం ప్రసాద్, ఎన్‌వీ సుబ్బమ్మ, అల్లంపాటి శ్రీనివాస్‌రెడ్డి, ఎం.చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.


