● పోలీస్ కార్యాలయంలో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
నెల్లూరు(క్రైమ్): నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి 140 మంది విచ్చేసి తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీ అజిత వేజెండ్ల దృష్టికి తీసుకెళ్లారు. వాటిని పరిశీలించిన ఆమె చట్టపరిధిలో పరిష్కరించాలని ఆయా ప్రాంత పోలీస్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నగర ఏఎస్పీ దీక్ష, డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్‌లు, ఫిర్యాదుల విభాగం సెల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వినతుల్లో కొన్ని..
● నా కొడుకు సాయివినయ్ ఉద్యోగ నిమిత్తం తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. ఇంతవరకూ తిరిగి రాలేదు. కావలి ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. కుమారుని ఆచూకీ కనుక్కోవాలని ఓ మహిళ కోరారు.
● వెంకట్ అనే వ్యక్తి నా వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు తన దగ్గర పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. విచారించి చర్యలు తీసుకోవాలని వేదాయపాళెం ప్రాంతానికి చెందిన ఓ మహిళ వినతిపత్రమిచ్చారు.
● ఉద్యోగం ఇప్పిస్తానని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన రమేష్ నా వద్ద రూ.4.80 లక్షలు తీసుకుని మోసగించాడు. నగదు అడిగితే అంతు చూస్తామని బెదిరిస్తున్నాడని చిన్నబజారు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
● భర్త చెడు వ్యసనాలకు బానిసై నన్ను, ఇద్దరు పిల్లలను వదిలేసి వెళ్లాడు. కుటుంబ పోషణ భారంగా మారింది. అతని ఆచూకీ కనుక్కోవాలని గూడూరు రూరల్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు.


