● అక్రమంగా గ్రావెల్ తరలింపు
● ఐదు ట్రాక్టర్లు, ఒక జేసీబీ సీజ్
పొదలకూరు: పట్టపగలు పొదలకూరుకు సమీపంలోని చిట్టేపల్లి తిప్ప నుంచి అక్రమంగా ట్రాక్టర్లలో గ్రావెల్‌ను తరలిస్తుండగా సోమవారం పోలీసులు సీజ్ చేశారు. ఎస్సై ఎస్‌కే హనీఫ్ గ్రావెల్ అనుమతులను అడిగితే ఏఎంఆర్‌కు నగదు చెల్లించి తోలుతున్నట్టు వెల్లడించారు. అయితే రోడ్డు ఎక్కిన తర్వాత ట్రిప్పునకు ఏఎంఆర్‌కు రూ.300 వంతున చెల్లిస్తుండగా క్వారీ నిర్వహణకు మాత్రం అనుమతి లేకపోడంతో ఎస్సై ఐదు ట్రాక్టర్లు, ఒక జేసీబీని సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇప్పటికే చిట్టేపల్లి తిప్పను అక్రమార్కులు తవ్వేశారు. కొండ దాదాపుగా కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. ఎలాంటి అనుమతుల్లేకుండా ఇక్కడి నుంచి రేయింబళ్లు ఏఎంఆర్ పేరు చెబుతూ గ్రావెల్‌ను తరలించేస్తున్నారు.
హౌసింగ్ గ్రావెల్ కూడా..
తిప్పపై హౌసింగ్ శాఖ ద్వారా నిర్మించిన ఇళ్లకు సంబంధించిన రోడ్లు, లెవలింగ్ గ్రావెల్‌ను కూడా అక్రమార్కులు వదిలిపెట్టలేదు. ఇటీవల దానిని సైతం తరలించి సొమ్ము చేసుకున్నారు. హౌసింగ్ అధికారులు పోలీసుల దృష్టికి సైతం తీసుకెళ్లారు. విద్యుత్ స్తంభాల చుట్టూ ఉన్న గ్రావెల్‌ను కూడా లోడేసి తరలించడంతో స్తంభాలు బలహీనంగా మారినట్టు తెలుస్తోంది.


