నెల్లూరు(దర్గామిట్ట): పొట్టి శ్రీరాములు జయంతిని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించారు. అమరజీవి చిత్రపటానికి కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
శివుడి వద్ద
నాగేంద్రుడి దర్శనం
● విశ్వనాథస్వామి ఆలయంలో వింత
మనుబోలు: మనుబోలులోని చెర్లోపల్లి రైల్వేగేటు సమీపంలో ఉన్న విశ్వనాథస్వామి ఆలయంలో సోమవారం విశిష్టతగా అర్చకుడు శ్రీనివాసులు శివ లింగానికి పూజలు చేస్తుండగా నాగేంద్రుడు మళ్లీ దర్శనమిచ్చాడు. ఇటీవల కాలంలో తరచూ ప్రత్యేక సందర్భాల్లో శివలింగం వెనుకనే ఉన్న పుట్టలో నుంచి నాగుపాము వచ్చి శివలింగం పక్కన పడగ విప్పి చాలాసేపు ఉంటుంది. సోమవారం కూడా అదే తరహాలో నాగేంద్రుడు శివలింగం వద్ద పడగ విప్పి ఉండగా ఫొటోలను కొందరు యువకులు తీసి సోషల్ మీడియాలో ఉంచారు. ఈ విషయం సంచలనంగా మారింది. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి నాగేంద్రుడిని దర్శించుకున్నారు.
ఏప్రిల్ 25న
పాలిసెట్ ప్రవేశ పరీక్ష
నెల్లూరు (టౌన్): పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశం కోసం ఏప్రిల్ 25న పాలిసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్లుగా జిల్లా పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష కోఆర్డినేటర్ ఎస్ రామారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది రాపూరు, వెంకటగిరిలో కూడా ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నామని చెప్పారు. వచ్చే నెల 1 నుంచి నెల్లూరులోని వెంకటేశ్వపురంలో ఉన్న ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశ పరీక్షకు సంబంధించి ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, డీసీసీపీ, తదితర సాంకేతిక కోర్సుల్లో శిక్షణ పొందిన వారికి కచ్చితంగా ఉపాధి లభిస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో హెల్ప్‌లైన్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల సమాచారాన్ని 99123 42016 నంబరును సంప్రదించి పొందవచ్చని తెలిపారు.
28న జెడ్పీ సాధారణ
సర్వసభ్య సమావేశం
నెల్లూరు(పొగతోట): జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్నట్లుగా జెడ్పీ సీఈఓ శ్రీధర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు సమావేశం జరుగుతుందని చెప్పారు. విద్య, పంచాయతీరాజ్, ఇంజినీరింగ్, ఆర్‌డబ్ల్యూఎస్, డీఆర్డీఏ, తదితర శాఖలపై సమీక్షించనున్నట్లుగా తెలిపారు. జిల్లా పరిషత్ సభ్యులు, జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.
వెబ్‌సైట్‌లో
సీనియారిటీ జాబితా
నెల్లూరు (టౌన్): జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, కార్పొరేషన్ పరిధిలోని పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన రెండో సీనియారిటీ జాబితాను http://deonellore.50.we bs.com వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లుగా జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ బాలాజీరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5గంటల్లోపు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో తగిన ఆధారాలను సమర్పించాలని కోరారు.


