నెల్లూరురూరల్: అధికారం శాశ్వత కాదని కూటమి పాలకులు గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అరాచకాలు చేస్తున్నారని, అక్రమ కేసులు బనాయించి పైశాచికానందం పొందుతున్నారని మండిపడ్డారు. జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న పిన్నెల్లి సోదరులను రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, నెల్లూరురూరల్ ఇన్‌చార్జి ఆనం విజయకుమార్‌రెడ్డితో కలిసి సోమవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతోందన్నారు. చంద్రబాబు ఆయన కుమారుడు లోకేశ్ కలిసి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అనేక అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైల్లో అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. వ్యవస్థలను అడ్డు పెట్టుకొని అరాచకాలు చేస్తే ఏదో ఒక రోజు ఆ వ్యవస్థ మీకు భూమ్‌రాంగ్ అవుతుందన్న విషయాన్ని గుర్తుచేసుకోవాలన్నారు. భవిష్యత్‌లో నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అన్నట్లు వ్యవస్థలను తయారు చేస్తున్నారన్నారు. టీడీపీలోని రెండు వర్గాలు కొట్టుకుని చనిపోతే పిన్నెల్లిపై అక్రమ కేసులు బనాయించి చంద్రబాబు, ఆయన కుమారుడు పైశాచికానందం పొందుతున్నారన్నారు. ఇదే విషయం అప్పటి ఎస్పీ చెప్పారన్నారు. పిన్నెల్లికి మధుమేహ వ్యాధి ఉందని, ఆయనకు సక్రమంగా మందులు జైలు అధికారులు అందించడం లేదన్నారు. దీంతో ఆరోగ్యం దెబ్బతిని బరువును కూడా కోల్పోయారన్నారు. ఇది ఒక దుశ్చర్య అని, ఫలితం త్వరలోనే అనుభవిస్తారని హెచ్చరించారు.రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీలోని బలమైన నాయకులను ఎన్నుకుని అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపి ఈ ప్రభుత్వం పైశాచికానందం పొందుతుందన్నారు. పోలీసులు చార్జ్‌షీట్ వేసి 96 రోజులైందని, బెయిల్ రాకుండా అడ్డుకోవడం హేయమైన చర్య అన్నారు. పిన్నెల్లి సోదరులను జైల్లో హింసిస్తున్నారన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని జైలు అధికారులు గుర్తెరిగి ప్రవర్తించాలన్నారు. అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారి వ్యవహరిస్తే, అధికారం కోల్పోయిన రోజు కాపాడడానికి ఎవరూ రారని హెచ్చరించారు.
పోలీసులను అడ్డుపెట్టుకొని
కూటమి పాలకులు అరాచకం
అక్రమ కేసులు బనాయించి పైశాచిక ఆనందం పొందుతున్నారు
వ్యవస్థలను అడ్డుపెట్టుకుని
వికృత క్రీడకు తెరదీశారు
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి


