ప్రశాంతంగా పది పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా పది పరీక్షలు

Mar 17 2026 7:29 AM | Updated on Mar 17 2026 7:29 AM

తొలిరోజు 260 మంది గైర్హాజరు

నెల్లూరు (టౌన్‌): పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 174 సెంటర్లలో పరీక్షలను నిర్వహించారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరిగాయి. తొలిరోజు జరిగిన తెలుగు పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 28,131 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 27,871 మంది రాశారు. 260 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షకు గంట ముందుగా విద్యార్థులను కేంద్రంలోకి అనుమతించారు. హాల్‌ టికెట్‌ నంబర్లను పరీక్ష కేంద్రాల్లోని నోటీసు బోర్డుల్లో ప్రదర్శించారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ నంబరును ఏ గదిలో కేటాయించారో చూసుకుని లోపలికి వెళ్లారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి కేంద్రంలోకి అనుమతించారు. కలెక్టర్‌ హిమాన్షుశుక్లా సంతపేటలోని సెయింట్‌ జోసెఫ్‌ బాలికల హైస్కూల్‌ కేంద్రాన్ని తనిఖీ చేశారు. డిస్ట్రిక్ట్‌ లెవల్‌ ఆఫీసరు రవీంద్రారెడ్డి ఏడు కేంద్రాలను తనిఖీ చేయగా, డీఈఓ బాలాజీరావు ఐదు కేంద్రాలు, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ 4 కేంద్రాలను పరిశీలించారు.

పరీక్ష కేంద్రాల వద్ద కోలాహలం

తొలిరోజు పరీక్షకు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు రావడంతో పరీక్ష కేంద్రాల వద్ద కోలాహలం నెలకొంది. తొలుత పలువురు విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థులు పరీక్ష రాసి వచ్చేంత వరకు తల్లి,దండ్రులు కేంద్రాల వద్ద పడిగాపులు కాశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో చెట్ల కింద సేద తీరారు. పరీక్షా కేంద్రాల సమీపంలో 144 సెక్షన్‌ను అమలు చేశారు. ఎక్కువ మంది అక్కడ లేకుండా పోలీసులు దూరంగా పంపించారు.

ఓపెన్‌ స్కూల్‌ పది పరీక్షలకు

139 మంది గైర్హాజరు

ఏపీ ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతి పరీక్షలకు సోమవా రం జిల్లా వ్యాప్తంగా 139 మంది అభ్యాసకులు గైర్హాజరయ్యారు. మొత్తం 1130 మందికి గానూ 991 మంది అభ్యాసకులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 15 సెంటర్లలో పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం 12.30 గంటల వరకు జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement