జర్నలిస్టులపై ఇసుక మాఫియా దాడి | - | Sakshi
Sakshi News home page

జర్నలిస్టులపై ఇసుక మాఫియా దాడి

Mar 17 2026 7:29 AM | Updated on Mar 17 2026 7:29 AM

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌కు ఫిర్యాదు

నెల్లూరు (దర్గామిట్ట): జిల్లాలోని పెన్నా పరీవాహక ప్రాంతాల్లో అక్రమంగా సాగుతున్న ఇసుక రవాణాను వెలుగులోకి తెచ్చేందుకు వెళ్లిన జర్నలిస్టులపై ఇసుక మాఫియా ముఠా దాడికి తెగబడిందని, ఈ దౌర్జన్యంపై నెల్లూరు జిల్లా ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా జేఏసీ ప్రతినిధులు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌ హిమాన్షు శుక్లాను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకుడు జయరాజ్‌ మాట్లాడుతూ ఓ టీవీ చానల్‌ ప్రతినిధులు సురేంద్ర, కమలాపస్‌ మనోజ్‌, మహమ్మద్‌ షాహీన్‌, వెంకటగిరి, ఆత్మకూరు రిపోర్టర్లు కలిసి కలువాయి మండలంలోని రాజపాళెం, తెలుగురాయపురం, పొదలకూరు మండలంలోని విరువూరు రీచ్‌ల్లో జరుగుతున్న ఇసుక తవ్వకాలను పరిశీలించేందుకు వెళ్లారన్నారు. విరువూరు రీచ్‌ వద్ద విజువల్స్‌ తీసుకుంటున్న సమయంలో కొందరు వ్యక్తులు జర్నలిస్టులను అడ్డుకున్నారన్నారు. బెదిరింపులతో పాటు దౌర్జన్యం చేస్తూ జర్నలిస్టుల కారును అడ్డగించి జర్నలిస్టులపై అసభ్య పదజాలంతో విరుచుకు పడ్డారన్నారు. ‘ఇక్కడికి ఎందుకు వచ్చారు.. విజువల్స్‌ ఎందుకు తీస్తున్నారు.. మిమ్మల్ని ఇక్కడే చంపేస్తాం’ అంటూ బెదిరించరని విన్నవించారు. కారు అద్దాలు పగులగొట్టే ప్రయత్నం చేయడమే కాకుండా, విధుల్లో ఉన్న జర్నలిస్టులను భయాందోళనలకు గురిచేశారన్నారు. ఈ ఘటనపై బాధితులు పొదలకూరు ఎస్సైకు సమాచారం అందించగా, ఆయన స్పందించిన తీరు వివాదాస్పదంగా ఉందన్నారు. ఇసుక మాఫియా వ్యక్తులకు వత్తాసు పలుకుతూ, జర్నలిస్టులనే ప్రశ్నించడం గమనార్హమని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఆడియో రికార్డులు కూడా తమ వద్ద ఉన్నాయని మీడియా ప్రతినిధులు వివరించారు. నిజాయతీగా వార్తలు సేకరిస్తున్న జర్నలిస్టులపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని జేఏసీ నేతలు మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని వారు కలెక్టర్‌ను కోరారు. ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు సురేంద్ర, సునీల్‌, సాగర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement