కావలి : తీరప్రాంత మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని మైరెన్ సీఐ సీహెచ్‌వీ శేషయ్య అన్నారు. కావలి రూరల్ మండలం వెంకటేశ్వరపాళెంలో తీరప్రాంత భద్రతపై మత్స్యకారులకు అవగాహన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీరప్రాంత మత్స్య కారులు సైనికుల్లా వ్యవహరించాలన్నారు. దేశంలోకి సముద్ర మార్గం ద్వారా ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందన్నారు. అందువల్ల తీరంలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, బోట్లు కనిపిస్తే వెంటనే మైరెన్ పోలీస్ టోల్‌ఫ్రీ నంబర్ 1093 లేదా కోస్ట్‌గార్డ్ టోల్‌ఫ్రీ నంబర్ 1554కు సమాచారం అందజేయాలని కోరారు. అనంతరం సీఆర్‌జెడ్ యాక్ట్‌పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ అధికారి, వీఆర్‌ఏ వెంకటేశ్వర్లు, గ్రామ కాపులు కొండూరి యానాది, ఆవుల వెంకయ్య, నరసయ్య, మైరెన్ పోలీసులు కృష్ణ, రమేష్ , బాలసుబ్రహ్మణ్యం, శామ్యూల్, సిబ్బంది పాల్గొన్నారు.
గ్రావెల్ అక్రమ
తరలింపు నిలిపివేత
ఉదయగిరి: దుత్తలూరులోని ఓ లేఅవుట్‌కు ముత్తరాశిపల్లి చెరువు నుంచి గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తున్నారు. ఈ విషయమై ‘సాక్షి’లో ‘అవినీతి ఒరవడి..చెరువుల దోపిడీ’ పేరుతో ఆదివారం కథనం ప్రచురితం కావడంతో ఇరిగేషన్ ఎస్‌ఈ దేశ్‌నాయక్ స్పందించారు. గ్రావెల్ అక్రమ తరలింపును నిలిపివేయించారు. శనివారం చెరువు నుంచి గ్రావెల్ తరలింపు విషయమై ఇరిగేషన్ అధికారులను ‘సాక్షి’ వివరణ కోరగా ఎవరూ స్పందించలేదు. ‘సాక్షి’లో కథనం వచ్చినా స్థానిక ఇరిగేషన్ అధికారులు స్పందించకపోవడంతో అక్రమార్కులు ఆదివారం ఉదయం కూడా గ్రావెల్ తరలింపును కొనసాగించారు. అయితే విషయం తెలుసుకున్న ఎస్‌ఈ వెంటనే గ్రావెల్ తరలింపును నిలిపివేయించి తగిన చర్యలు తీసుకోవాలని కావలి ఈఈ ఖాన్‌ను అదేశించారు. అంతేగాకుండా శనివారమే గ్రావెల్ తరలింపును నిలిపివేయాలని స్థానిక ఏఈ వెంకటసుబ్బయ్యన ఆదేశించినా ఖాతరు చేయకపోవడంపై సోమవారం వ్యక్తిగతంగా తన ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లుగా తెలిసింది.
చెరువు చేపల ధారాదత్తం
● వేలం నిర్వహించకుండానే టీడీపీ నాయకుడికి అప్పగింత
● పంచాయతీ ఆదాయానికి గండి
కొండాపురం : మండలంలోని గరిమెనపెంట పంచాయతీ పరిధిలోని చల్లగిరగల చెరువు చేపలను ఇరిగేషన్ అధికారులు ధారాదత్తం చేశారు. బహిరంగ వేలం పాట నిర్వహించకుండానే టీడీపీ నాయకుడికి అప్పగించి పంచాయతీ ఆదాయానికి గండికొట్టారు. బహిరంగ వేలం పాట నిర్వహించి అత్యధిక ధరకు పాడిన వారికి చెరువు ను అప్పగించాలి. కానీ పంచాయతీకి చెందిన టీడీపీ నాయకుడి సిఫార్సు మేరకు ఇరిగేషన్ అధికారులు వరికుంటపాడు మండలం శాసు్త్రలవారిపల్లి గ్రామానికి చెందిన మరో టీడీపీ నాయకుడికి రూ.20వేలకు అప్పగించారు. చెరువు చేపల వేలం ద్వారా గతేడాది రూ.50వేలు, అంతకుముందు ఏడాది రూ.లక్ష ఆదాయం పంచాయతీకి లభించింది. ఈ ఏడాది టీడీపీ నాయకుడికి రూ.20వేలకే అప్పగించడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లును వివరణ కోరగా తనకు తెలియదని, ఇరిగేషన్ అధికారులే వేలం నిర్వహించారని తెలిపారు. ఇరిగేషన్ ఏఈ వెంకట్రావును వివరణ కోరగా పంచాయతీ తీర్మానంతోనే చెరువును రూ.20వేలకు అప్పగించామని, సాగునీటి సంఘం అధ్యక్షుడు దొడ్డ గంగయ్య ఖాతాలో నగదు జమచేశామని తెలిపారు.


