● పోలీసులపైనే కాల్పులకు
తెగబడడం అత్యంత దారుణం
● ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి
నెల్లూరురూరల్: టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌యాదవ్ డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడి వారిపైనే కాల్పులకు తెగబడడం అత్యంత దారుణమైన విషయమని వైఎస్సార్‌సీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఖండించారు. నగరంలోని వైఎస్సార్‌సీపీ సిటీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రోజు సభ్య సమాజం తలదించుకునేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. డ్రగ్స్ ముఠాను పట్టుకునేందుకు పోలీసులు జరిపిన రైడ్‌లో ఎంపీ మహేష్‌యాదవ్ ముఠా వారిపైనే కాల్పులకు తెగబడడం చూస్తే ఒక ప్రజాప్రతినిధిగా సమాజానికి ఏమి సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. సమాజంలో శాంతిభద్రతల కోసం పాటు పడుతున్న పోలీసులపైన కాల్పులు జరపడం అత్యంత దుర్మార్గమన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏపీలో డ్రగ్స్ కల్చర్ పెచ్చుమీరిపోయిందని వైఎస్సార్‌సీపీ మొదటి నుంచి చెబుతూనే వస్తుందన్నారు. అడ్డూఅదుపు లేకుండా పోలీసుల కళ్లు గప్పి చుట్టూ పక్కల రాష్ట్రాల నుంచి ఏపీకి పెద్ద మొత్తంలో గంజాయి దిగుమతి అవుతుందన్నారు. ఈ గంజాయి టీడీపీ నాయకులు, కార్యకర్తల ద్వారానే ఏపీలో అన్ని జిల్లాల్లో హోమ్ డెలివరీ జరుగుతోందన్నారు. ప్రశాంతతకు మారుపేరైన నెల్లూరు నగరంలో కూడా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతున్నాయన్నారు. యువత డ్రగ్స్‌కు బానిసై పీకలు కోయడాలు, హత్యలు చేయడాన్ని మనమంతా చూస్తున్నామన్నారు. ఒక పార్లమెంట్ సభ్యుడు అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి డ్రగ్స్ సేవిస్తూ, ఒక డ్రగ్స్ ముఠాను తయారు చేస్తూ సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహరించడం సిగ్గు చేటన్నారు. దీనికి హోం మంత్రి సమాధానం చెప్పాలన్నారు. గతంలో ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో డ్రగ్స్ తీసుకున్నారని, పోలీసులకు పట్టుబడ్డారనే విషయాలు విన్నాము.. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విచ్చలవిడిగా డ్రగ్స్ తీసుకుంటూ రోడ్ల మీదకు వచ్చి రూ.200, రూ.300లకు పీకల కోయడం హత్యలు చేయడం చూస్తున్నామన్నారు. కొంత మంది దారి దోపిడీలకు పాల్పడుతూ అడ్డొచ్చిన వారిని కత్తులతో పొడిచి చంపేయడం కూడా చూస్తున్నామన్నారు. జరుగుతున్న ఈ పరిణామాలకు సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత ప్రజలకు ఏమని సమాధానం చెబుతారో చూడాలన్నారు. హోం మంత్రి అనిత అనేక సందర్భాల్లో మాట్లాడుతూ డ్రగ్స్‌ను మేము లేకుండా చేస్తాం, నిర్మూలిస్తామని చెప్పారని, దీనికి మీరేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఎంపీ పుట్ట మహేష్‌యాదవ్ చేత రాజీనామా చేయించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందన్నారు.


