చిన్నారులపై కామాంధులు కాటేస్తున్నారు. మృగాళ్ల చేతిలో అభం శుభం తెలియని చిన్నారులే కాకుండా మహిళలు సైతం బలైపోతున్న ఘటనలు భయాందోళనలకు
గురిచేస్తున్నాయి. చట్టాలు కఠినంగా ఉన్నా.. మృగాళ్ల దాష్టీకాలకు ఏ మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ప్రేమ పేరుతో ఒకరు.. గంజాయి మత్తులో మరొకరు.. కామంతో మరొకరు.. ఇలా రోజురోజుకూ ఇలాంటి దారుణాలు పెరుగుతుండటం ప్రజలను కలవరపెడుతున్నాయి. ఆడ పిల్లలకు ఇంటా, బయట భద్రత కొరవడింది. ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించడంలో పోలీసులు విఫలమవుతున్నారు. మరో వైపు దారుణ ఉదంతాలు వెలుగు చూసినా.. వీలైతే కప్పిపుచ్చడం,
కాకుంటే.. తారుమారు చేసేందుకూ వెనుకాడటం లేదు.
సాక్షి టాస్క్‌ఫోర్స్: ‘మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడితే అదే ఆఖరు రోజు అవుతుందంటూ’ బహిరంగ వేదికల్లో సాక్షాత్తు కూటమి ప్రభుత్వ పెద్దలే రోమాలు నిక్కబొడుచుకునే రీతిలో ఉపన్యాసాలిస్తున్నారు. నేరం చేయాలంటేనే భయపడే పరిస్థితి తీసుకొస్తామన్న మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడిచిన ఇరవై నెలల్లోనే జిల్లాలో బాలికలపై అనేక దారుణాలు జరిగాయి. ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో నమోదైన సుమారు 40 పోక్సో కేసులే ఇందుకు అద్దం పడుతున్నాయి. జిల్లాలో విచ్చలవిడిగా గంజాయి, మద్యం విక్రయాలే ఇలాంటి దారుణాలకు ప్రధాన కారణాలవుతున్నాయని మహిళా సంఘాలు, అభ్యుదయ వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు ఒంటరిగా కనిపిస్తే కామాంధులు ఏ వైపు నుంచి కాటేస్తారోనని కుటుంబ సభ్యులు భయపడుతున్నారు. ఇలాంటి దారుణ పరిస్థితులు గతంలో ఎన్నడూ చూడలేదంటూ వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. చిన్నారులు, మహిళలకు రక్షణ కల్పించాలని, కామాంధులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
వణికిస్తున్న వరుస ఘటనలు
జిల్లాలో బాలికలపై వరుసగా జరుగుతున్న ఘటనలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. చిన్నారులకు ఇంటా, బయటా భద్రత కొరవడింది. మానవ మృగాలుగా మారిన కొందరు అభం, శుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. వావివరుసల తేడా లేకుండా కామాంధుల వికృత చేష్టలకు చిన్నారుల జీవితాలు చితికిపోతున్నాయి. మహిళలే కాదు చిన్నారులు ఒంటరిగా బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. స్నేహం, ప్రేమ ముసుగులో మృగాళ్లు లైంగిక దాడులకు పాల్పడుతూ వారి జీవితాలను చిదిమేస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన పేగుబంధాలు సైతం కాటేస్తున్నాయి. గత నెల రోజులుగా జిల్లాలో జరిగిన ఘటనలను పరిశీలిస్తే..
● కోవూరులో బాలిక ఉదంతం తర్వాత కావలి మండలంలోని ఓ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ లైంగిక దాడి చేశాడు. బాధిత బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
● కోట మండలం అటవీ ప్రాంతంలో 12 ఏళ్ల బాలికపై ఆటోడ్రైవర్ లైంగికదాడికి యత్నించాడు.
● గూడూరు పరిధిలో ఐదేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు.
● ఉదయగిరిలో బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా అనుభవించి గర్భిణిని చేసిన బాలుడిపై పోక్సో కేసును ఉదయగిరి పోలీసులు నమోదు చేశారు.
● కావలి పట్టణంలో ఓ పాఠశాలలో చదువుతున్న బాలికలకు తినుబండారాల ఆశ చూపి ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై పోక్సో కేసును కావలి రెండో పట్టణ పోలీసులు నమోదు చేశారు.
● నెల్లూరు నగరంలో ఆరేళ్ల బాలికపై తండ్రి పైశాచికంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని గమనించిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
● తాజాగా తోటపల్లిగూడూరు మండలం వరిగొండలో ఓ బాలికపై లైంగిక దాడి జరిగిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
● వరికుంటపాడు మండలంలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తన వెంట తీసుకెళ్లాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను సంరక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఇలా చెప్పుకొంటూ పోతే జిల్లాలో ఇలాంటి ఘటనలు చాంతాడంత జాబితాలే ఉన్నాయి.
బాలికపై లైంగిక దాడి..?
వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి
తరలించిన పోలీసులు
అయితే ఘటనను తారుమారు
చేసేందుకు పోలీసుల యత్నం..?
నిందితులు చోరీకి వచ్చారంటూ
మీడియాకు వెల్లడి
తోటపల్లిగూడూరు(పొదలకూరు): తోటపల్లిగూడూరు మండలం వరిగొండలో బాలిక (8)పై లైంగిక దాడి జరిగిందనే ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనలోని బాధితురాలిని పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం నెల్లూరు జీజీహెచ్‌కు తరలించారు. అయితే సోషల్ మీడియాలో బాలికపై లైంగిక దాడి జరిగినట్లు వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కాగా ఈ ఘటనను తారుమారు చేసేందుకు పోలీసులు ఆపసోపాలు పడుతున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. బాలికపై లైంగిక దాడి జరగలేదని, నిందితులు దొంగతనానికి వచ్చారని మీడియా ముఖంగా వెల్లడించారు. అయితే నిందితులు చోరీకి వస్తే.. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్‌కు ఎందుకు తరలించారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.
అసలేం జరిగిందంటే..
స్థానికుల సమాచారం మేరకు.. వరిగొండ గ్రామంలో కాలువ గట్టుపై బాలిక కుటుంబం నివసిస్తోంది. గురువారం ఆమె తల్లిదండ్రులు పనికెళ్లడంతో తమ్ముడితో కలిసి ఇంట్లో ఉండగా గుర్తుతెలియని వ్యక్తి (40) మరో మహిళతో కలిసి బైక్‌పై వచ్చారు. అయితే బాలిక తమ్ముడికి మహిళ కొని పెడతానని మాయమాటలు చెప్పి దూరంగా తీసుకెళ్లడంతో ఆ వ్యక్తి బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. బాలిక కేకలేయడంతో స్థానికులు అక్కడికి రావడంతో మహిళతో కలిసి ఆగంతకుడు పారిపోయారు. దీంతో బాలికను వైద్య పరీక్షల నిమిత్తం నెల్లూరు జీజీహెచ్‌కు పోలీసులు తరలించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి కృష్ణపట్నం పోర్టు ఇన్‌చార్జి సీఐ సుబ్బారావు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వచ్చిన వారు బాలిక ఇంట్లో టీవీని దొంగలించేందుకు యత్నించారని వెల్లడించారు. బాలికతో పాటు ఆరేళ్ల బాలుడు ఉన్నాడన్నారు. వీరిని చూసి బాలుడు కేకలేయడంతో నిందితులు పరారయ్యారని వివరించారు. అయితే నిందితులు చోరీ యత్నానికి పాల్పడితే బాలికకు వైద్య పరీక్షలు ఎందుకు చేయిస్తున్నారనేది చర్చనీయాంశంగా మారింది.
యువకుడిపై
పోక్సో కేసు నమోదు
వరికుంటపాడు: మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడిపై పోక్సో కేసును నమోదు చేసి కోర్టులో హాజరుపర్చామని ఎస్సై రఘునాథ్ శుక్రవారం తెలిపారు. ఆయన కథనం మేరకు.. మీరయ్య అనే యువకుడు ఓ బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కావలి డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో సిబ్బంది గాలించి జడదేవి గ్రామ సమీపంలో ఆ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
29.01.2026
నెల్లూరు నగరంలో ఆరేళ్ల చిన్నారిపై కన్నతండ్రి లైంగిక దాడి చేశాడు.
29.01.2025
ఏడో తరగతి చదువుతున్న బాలికను ఆటోడ్రైవర్ సతీష్ మాయమాటలు చెప్పి కొత్తకోడూరు బీచ్‌కు తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. అతనితో పాటు సహకరించిన స్నేహితులపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.
16.03.2025
స్నేహితుడి కుమార్తెకు మాయమాటలు చెప్పి కుమార్ లైంగిక దాడి చేశాడు. ఈ ఘటన సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో జూన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.
17.07.2025
ఆత్మకూరు మండలంలో ఓ బాలికపై ప్రణవ్ లైంగిక దాడి చేశాడు.
18.07.2025
ఆత్మకూరు మండలానికి చెందిన ఓ బాలిక ఆత్మకూరు పట్టణంలో చదువుతోంది. గ్రామానికి చెందిన చందన్ ప్రేమించాలంటూ ఆమెను వేఽధించాడు. నిరాకరించడంతో ఆమైపె దాడిచేసి గాయపరిచాడు.
27.07.2024
కావలి పట్టణంలో చిన్నారికి మాయమాటలు చెప్పి మహబూబ్‌బాషా లైంగిక దాడి చేశాడు.
మానవ మృగాళ్ల దాడిలో సమిధలుగా బాలికలు
జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న
వరుస ఘటనలు
ఇంటా.. బయటా కొరవడిన భద్రత
ఈ దారుణాలను కప్పిపుచ్చుతున్న
పోలీసులు
తాజాగా వరిగొండలో
బాలికపై లైంగిక దాడి..?
వరికుంటపాడులో ప్రేమ పేరిట
బాలికను తీసుకెళ్లిన యువకుడు
విచ్చలవిడిగా గంజాయి,
మద్యం విక్రయాలే కారణాలు


