రైతులకు విరివిగా రుణాలివ్వండి | - | Sakshi
Sakshi News home page

రైతులకు విరివిగా రుణాలివ్వండి

Mar 7 2026 9:29 AM | Updated on Mar 7 2026 9:29 AM

నెల్లూరు(అర్బన్‌): వ్యవసాయ అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యమిచ్చి రైతులకు రుణాలను విరివిగా మంజూరు చేయాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా సూచించారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా స్థాయి బ్యాంకర్లతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు, డ్రోన్లు తదితరాల కొనుగోళ్లకు రుణాలను అధికంగా ఇవ్వాలని కోరారు. పశు, మత్స్య, కోళ్ల పరిశ్రమలను ప్రోత్సహించాలని చెప్పారు. డ్రాగన్‌ ఫ్రూట్‌, బొప్పాయి లాంటి ఉద్యాన పంటలు, పీఎం సూర్యఘర్‌కు లోన్లు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించి యాక్టివ్‌లో లేని అకౌంట్లను వెంటనే పునరుద్ధరించాలని సూచించారు. అనంతరం నాబార్డు ద్వారా అమలవుతున్న పథకాలకు సంబంధించిన పుస్తకాలను ఆవిష్కరించారు. లీడ్‌ డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ మణిశేఖర్‌, డీఆర్వో విజయకుమార్‌, నాబార్డు డీడీఎం బాబు, జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి, డీఆర్డీఏ, మెప్మా, డ్వామా పీడీలు నాగరాజకుమారి, లీలారాణి, గంగాభవానీ, పశు, మత్స్య, ఉద్యాన శాఖల అధికారులు రమేష్‌నాయక్‌, చాన్‌బాషా, సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

యూనిఫైడ్‌ సర్వేను

పూర్తి చేయండి

నెల్లూరు(పొగతోట): యూనిఫైడ్‌ సర్వేను నూరు శాతం పూర్తి చేయాలని జెడ్పీ సీఈఓ శ్రీధర్‌రెడ్డి ఆదేశించారు. నగరంలోని జెడ్పీ కార్యాలయం నుంచి వివిధ మండలాల అధికారులతో శుక్రవారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. గ్రామాల వారీగా ఇచ్చిన జాబితాల్లో ఒకట్రెండు కుటుంబాలు వలసెళ్లాయంటే నమ్మశక్యంగా ఉంటుందని, అయితే దీన్ని సక్రమంగా చేయకుండా ఇలా చెప్పడం సరికాదన్నారు. నిర్దేశిత సమయంలోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

‘పది’ పరీక్షలకు

పక్కాగా ఏర్పాట్లు

ఆత్మకూరు: పదో తరగతి పరీక్షలను పక్కాగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని డీఈఓ బాలాజీరావు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో విధి విధానాలపై ఆత్మకూరు డివిజన్‌ పరిధిలోని తొమ్మిది మండలాల చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలోని 174 పరీక్ష కేంద్రాలకు 174 మంది చొప్పున చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లను నియమించామని వివరించారు. సెట్‌ – 1, 2 ప్రశ్నపత్రాలను ఈ నెల పది, 11 నాటికి భద్రపర్చి పరీక్షకు అర్ధగంట ముందు అందజేయనున్నామని వెల్లడించారు. విద్యార్థులు బాగా చదివి పరీక్షలను చక్కగా రాయాలని కాంక్షించారు. డిప్యూటీ డీఈఓ జానకిరామ్‌, శిక్షకులు ఫణీష్‌, రామ్‌కుమార్‌, ఎంఈఓలు అనంతలక్ష్మి, చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.

వీఆర్‌కు ఇద్దరు సీఐలు

నెల్లూరు(క్రైమ్‌): బుచ్చిరెడ్డిపాళెం ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, బుచ్చిరెడ్డిపాళెం రూరల్‌ సీఐ సురేంద్రబాబును రేంజ్‌ వీఆర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులను గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి శుక్రవారం జారీ చేశారు. తుళ్లూరు – 2 సీఐగా పని చేస్తున్న శ్రీనివాసరావును బుచ్చిరెడ్డిపాళెం ఇన్‌స్పెక్టర్‌గా.. ఒంగోలు ఎస్సీ, ఎస్టీ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ దుర్గాప్రసాద్‌ను రూరల్‌ సీఐగా నియమించా రు. వీఆర్‌కు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement