నెల్లూరు సిటీ: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారుల అలసత్వంపై ఓ రైతు ఆవేదనతో సివిల్ సప్లయ్స్ విభాగం పరుగులు తీసింది. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటూ అర్జీని ఓ అన్నదాత అందజేయగా, దాన్ని పరిష్కరించకుండానే సంతకం పెట్టాలని ఒత్తిడి చేశారు. అయితే దానికి అంగీకరించకపోవడంతో సాల్వ్ అయినట్లు మెసేజ్ పంపారు. ఈ ఉదంతంపై ‘కలెక్టర్ సార్.. ఇదేం పరిష్కారం’ అనే శీర్షికన సాక్షిలో కథనం శుక్రవారం ప్రచురితమైంది. దీంతో స్పందించిన అధికారులు.. ఫిర్యాదుదారుడి వద్దకే వెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు.
జరిగిందిదీ..
నెల్లూరు రూరల్ మండలంలోని ములుమూడిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏటా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం అలా చేయకపోవడంతో గ్రామానికి చెందిన సండి శ్రీనివాసులు.. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీని అందజేశారు. అయితే తన సమస్యను పరిష్కరించినట్లు మెసేజ్ రావడంతో కంగుతిన్నారు. ఈ తరుణంలో సాక్షిలో ప్రచురితమైన కథనంతో గ్రామానికి అధికారులు చేరుకున్నారు. కొనుగోలు కేంద్రాన్ని రెండ్రోజుల్లో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సివిల్ సప్లయ్స్ డీఎం తిరుపాల్, సీఈఓ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.


