● అఘాయిత్యానికి గురైన బాలికను
హడావుడిగా తరలించిన వైనం
● తీరుపై మండిపడిన కాకాణి పూజిత
నెల్లూరు రూరల్: తోటపల్లిగూడూరు మండలంలోని వరిగొండలో అఘాయిత్యానికి గురైన బాలిక ఉదంతంలో నెల్లూరులోని ప్రభుత్వాస్పత్రిలో హైడ్రామా శుక్రవారం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత వచ్చారు. ఈ క్రమంలో బాలికను హాస్పిటల్ సిబ్బంది, పోలీసులు హడావుడిగా తరలించారు. ఈ విషయాన్ని పూజిత ఆరాతీయగా, గైనకాలజీ విభాగాధిపతి గీతాకృష్ణని కలవాలని సూచించారు. దీంతో ఆమెను సంప్రదించగా, పాప విషయమే తమకు తెలియదంటూ బుకాయించారు. దీనిపై సమాచారమివ్వాలని పట్టుబట్టడంతో ఇక్కడ్నుంచి తరలించారంటూ ఎట్టకేలకు సమాధానమిచ్చారు. జిల్లాలో పోలీసులతో పాటు హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం దారుణంగా మారిందని మండిపడ్డారు.
మహిళలకు రక్షణ కరువు
కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని పూజిత ఆరోపించారు. వరిగొండలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడటం దారుణమని, గంజాయి మత్తులో రాష్ట్రంలో వరుస ఘటనలు చోటుచేసుకుంటున్నా, సర్కార్ ఏ మాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు తామొస్తే, ప్రభుత్వ వైఫల్యం బయటపడుతుందనే భయంతో పోలీసులు, ఆస్పత్రి సిబ్బంది హడావుడిగా తరలించి నాటకమాడారని ఆరోపించారు. పారదర్శకంగా విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కోవూరులోని గుమ్మళ్లదిబ్బలో ఇటీవల జరిగిన ఘటనను మరువకముందే తాజాగా ఇలాంటి ఉదంతం చోటుచేసుకోవడంపై విచారం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలను ఖాకీలు గాలికొదిలి.. ప్రశ్నించే వారికి నోటీసులిస్తూ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. పట్టణాలు, నగరాలకే పరిమితమైన డ్రగ్ కల్చర్, ప్రస్తుతం గ్రామాలకూ పాకిందని ధ్వజమెత్తారు. పార్టీ జోనల్ మహిళా ప్రెసిడెంట్ మొయిళ్ల గౌరి, జిల్లా మహిళాధ్యక్షురాలు సునంద, నెల్లూరు రూరల్ మహిళాధ్యక్షురాలు రమాదేవి, ముత్తుకూరు ఎంపీపీ సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.


