మంచి వైద్యులుగా పేరు తెచ్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

మంచి వైద్యులుగా పేరు తెచ్చుకోవాలి

Mar 7 2026 7:24 AM | Updated on Mar 7 2026 7:24 AM

నెల్లూరు(అర్బన్‌): డాక్టర్లుగా మారుతున్న వైద్య విద్యార్థులు ప్రజలకు వైద్యసేవలందిస్తూ సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ డాక్టర్‌ రఘునందన్‌ సూచించారు. నెల్లూరులోని ఏసీఎస్సార్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో డాక్టర్‌ విద్య పూర్తి చేసుకున్న ఏడో బ్యాచ్‌కు చెందిన 170 మంది వైద్య విద్యార్థులకు సంబంధించి పట్టాలిచ్చే కాన్వొకేషన్‌ డేను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రఘునందన్‌ మాట్లాడుతూ స్మార్ట్‌ డాక్టర్‌గా కాకుండా గాయానికి మందువేసి నయం చేసే మంచి డాక్టర్‌గా పేరు తెచ్చుకోవాలన్నారు. మృత్యువు కోరలు చాచే వేళ కొన ఊపిరి ఊది ప్రాణ దాతలుగా నిలవాలంటూ సాట పాడి కర్తవ్యాన్ని గుర్తు చేశారు.

● మరో ముఖ్యఅతిథి కలెక్టర్‌ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ డాక్టర్లు కనిపించే దేవుళ్లన్నారు. దేవుడిని చూస్తారో లేదో గానీ ఒక రోగిని కాపాడి ప్రాణం నిలిపినప్పుడు మొదటి దేవుడిగా డాక్టర్‌ కనిపిస్తారన్నారు. ఈ వృత్తి ఎంతో పవిత్రమైందన్నారు. రోగి చెప్పేది వైద్యుడు శ్రద్ధగా వినాలని, తర్వాత పరిశీలించి నవ్వుతూ వైద్యం చేయాలన్నారు. డబ్బే పరమావధిగా కాకుండా వైద్యంలో రాణిస్తూ సమాజానికి ఉపయోగపడాలని తెలిపారు.

● మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రాజేశ్వరి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కొండేటి మాధవి మాట్లాడుతూ వైద్యులుగా ప్రయాణం ఆరంభిస్తున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రొఫెసర్లు డాక్టర్‌ మస్తాన్‌బాషా, డాక్టర్‌ గోవిందు మాట్లాడుతూ నేటితో ఆటలు, చదువు బంద్‌ అయ్యాయన్నారు. ఇక నుంచి అసలైన జీవితం చూస్తారనన్నారు. రోగుల పట్ల కరుణ, దయ చూపుతూ సేవలందించాలని కోరారు. అనంతరం ప్రిన్సిపల్‌ కులమతాలు, లింగ, వర్ణ భేదాలు చూపకుండా సేవే దైవంగా భావించి వైద్యం చేయాలంటూ పట్టాలు తీసుకుంటున్న వారితో ప్రమాణం చేయించారు. ఇదే సందర్భంలో అత్యున్నత ప్రతిభ చూపిన ఏడుగురికి కలెక్టర్‌ గోల్డ్‌ మెడల్స్‌ అందజేసి అభినందించారు. వైద్య డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తర్వాత ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

డీఎంఈ రఘునందన్‌

వైద్యులు కనిపించే

దేవుళ్లు : కలెక్టర్‌ హిమాన్షు శుక్లా

ఘనంగా మెడికల్‌ కళాశాల కాన్వొకేషన్‌ డే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement