● సీపీఎం నేతల ధర్నా
నెల్లూరు(వీఆర్సీసెంటర్): సంవత్సరాలుగా నివాసముంటున్న పేద దళితుల ఇళ్లను అభివృద్ధి పేరుతో తొలగిస్తామంటే సహించేది లేదని సీపీఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, కమిటీ సభ్యుడు నాగేశ్వరరావు హెచ్చరరించారు. నెల్లూరులోని 8వ డివిజన్ కామాటి హరిజనవాడ ప్రాంతంలో దళితుల ఇళ్లను తొలగించవద్దంటూ శుక్రవారం నేతలు ధర్నా చేపట్టారు. వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కాలువలపై ఉన్న ఇళ్లను తొలగిస్తామని చెప్పడం సరికాదన్నారు. అధికారులు కాకుండా స్థానిక టీడీపీ నాయకులు వచ్చి ఈ ప్రాంతంలో ఇళ్లు ఖాళీ చేయాలని ప్రతి ఇంటికీ రూ.5 వేలు ఇస్తామని, టిడ్కో అపార్ట్‌మెంట్లకు వెళ్లాలని చెప్పడం సిగ్గుచేటన్నారు. 20 రోజుల నుంచి టీడీపీ నాయకులు స్థానికులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేయాలే కానీ ప్రజల ఇళ్లను కూల్చి రోడ్డు, కాలువలు వేస్తే అభివృద్ధి చెందుతుందా అని మంత్రి నారాయ ణను ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారు పన్నులు చెల్లిస్తున్నారని, వెంటనే పక్కాఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. కాగా నగర డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్ వచ్చి ఇళ్లను తొలగించకుండానే కాలువ నిర్మాణ పనులు చేపడతామనడంతో నాయకులు ధర్నాను విరమించారు.


