● పోలీసులకు మహిళ ఫిర్యాదు
ఆత్మకూరు: ఫైనాన్స్ కంపెనీలో రుణం తీసుకుని కొనుగోలు చేసిన స్కూటీని ఒక ఈఎంఐ కట్టలేదని దౌర్జన్యంగా తీసుకెళ్లారంటూ కె.లక్ష్మి అనే మహిళ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు లోని వివరాల మేరకు.. ఆత్మకూరు మండలం భంట్లపల్లి గ్రామానికి చెందిన కలువాయి లక్ష్మి ఏడాదిన్నర క్రితం శ్రీరామ్ ఫైనాన్స్‌లో రుణం తీసుకుని స్కూటీని కొనుగోలు చేశారు. క్రమం తప్పకుండా నెలకు రూ.3,500 చొప్పున ఈఎంఐ చెల్లించారు. నాలుగునెలల క్రితం ఆమె అనారోగ్యానికి గురైంది. దీంతో మూడునెలల ఈఎంఐ కట్టలేకపోయింది. ఆ సమయంలో ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ రాజేంద్రరెడ్డి, అదే సంస్థకు చెందిన కలెక్షన్ ఏజెంట్ ఎస్‌కే సుల్తాన్ గ్రామానికి వెళ్లి ఆమెను నగదు అడగటంతో అప్పటికప్పుడే రెండు ఈఎంఐలు చెల్లించారు. అక్కడి నుంచి వెళ్లిపోయిన ఉద్యోగులు మరో గంట తర్వాత వచ్చి కంపెనీ వారు ఒప్పుకోవడం లేదని, బాకీ ఉన్న మరో ఈఎంఐ కట్టాల్సిందేన ని బలవంతంగా వాహనాన్ని తీసుకెళ్లారు. కాగా రెండు రోజుల క్రితం ఈఎంఐలైనా చెల్లించండి లేదా వా హనాన్ని తిరిగివ్వండంటూ ఫైనాన్స్ కంపెనీ నుంచి నోటీసులొచ్చాయి. దీంతో ఆమె పట్టణంలోని ఫైనాన్స్ కంపెనీ వద్దకు వెళ్లి వాహనాన్ని తీసుకెళ్లారు కదా అని ప్రశ్నించారు. ఆ వ్యక్తులు ప్రస్తుతం కంపెనీలో లేరని.. వాహనం తమకు చేరలేదని ప్రస్తుత ఉద్యోగులు తెలిపారు. దీంతో ఆమె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసినట్లుగా ఎస్సై జిలానీ తెలిపారు.


