మచ్చలేని రాజకీయాలతో ముందుకెళ్తూ.. | - | Sakshi
Sakshi News home page

మచ్చలేని రాజకీయాలతో ముందుకెళ్తూ..

Mar 5 2026 7:40 AM | Updated on Mar 5 2026 7:40 AM

నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి కృషి

హామీలను అమలు చేయని చంద్రబాబు

మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి

మర్రిపాడు: దశాబ్దాల రాజకీయ జీవితంలో తమ సొంత నిధులతో రాజకీయాలు చేశామే తప్ప ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి జ్ఞాపకార్థం మండలంలోని సింగనపల్లిలో ఏర్పాటు చేసిన మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డితో కలిసి బుధవారం ప్రారంభించారు. దివంగత సీఎం వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం రాజమోహన్‌రెడ్డి మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో తమ కుటుంబంపై వేలెత్తి చూపే వారెవరూ లేరని, మచ్చలేని రాజకీయాలు చేస్తూ నమ్మిన ప్రజలు, పుట్టిన గడ్డను అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తున్నామని తెలిపారు. తాము అధికారంలోకి ఉన్నా.. లేకపోయినా, ఆత్మకూరు నియోజకవర్గాన్ని సొంత నిధులతో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.

మైనింగ్‌లో అక్రమాలు

ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీనీ అమలు చేయకుండా ప్రజలను సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో ఇసుక, మైనింగ్‌ అక్రమాలు పెరిగిపోయాయని చెప్పారు. మర్రిపాడులో ఉన్న ఇసుక కొండను మంత్రి కాక ముందే మాయం చేశారని విమర్శించారు. 21 నెలల్లో హైలెవల్‌ కెనాల్‌ పనులు ఒక్క శాతం ముందుకు సాగలేదని తెలిపారు. దీన్ని పూర్తి చేసి మెట్ట నియోజకవర్గాలను సస్యశ్యామలం చేసేందుకు గానూ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి సీఎంను చేసుకుందామని పిలుపునిచ్చారు. 17 మెడికల్‌ కళాశాలలు, పది ఫిషింగ్‌ హార్బర్లు ఇలా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఆయన అభివృద్ధి చేసిన అంశాన్ని ప్రస్తావించారు.

అవసరమైన ప్రాంతాల్లో వాటర్‌ ప్లాంట్లు

ఆత్మకూరులో ప్రజలకు అవసరమైన ప్రాంతాల్లో వాటర్‌ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నామని మేకపాటి విక్రమ్‌రెడ్డి వెల్లడించారు. దివంగత సీఎం వైఎస్సార్‌తో కలిసి ఉదయగిరి, ఆత్మకూరు ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు గానూ హైలెవల్‌ కెనాల్‌ పనులను తన తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి మంజూరు చేయించారని చెప్పారు. అయితే పనులు నిలిచిపోవడానికి కారణం భూసేకరణ తారుమారు కావడమేనని ఆరోపించారు. ఇలాంటి చర్యలతో పనులను ప్రభుత్వం నిలిపేసిందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో తమ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పొందుపర్చి, తమ ప్రభుత్వం కొలువుదీరాక వీటిని పూర్తి చేసే బాధ్యతను తాను తీసుకుంటానని తెలిపారు. అందరి సహకారంతో నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడించారు. మర్రిపాడు జెడ్పీటీసీ మల్లు సుధాకర్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్‌ చెన్ను వెంకటేశ్వరరెడ్డి, గంగవరపు శ్రీనివాసులునాయుడు, కాశిరెడ్డి, లక్ష్మీరెడ్డి, నారపరెడ్డి, కాంతారెడ్డి, ప్రతాప్‌రెడ్డి, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement