ప్రజారోగ్యంతో టీడీపీ నేతల చెలగాటం | - | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్యంతో టీడీపీ నేతల చెలగాటం

Mar 5 2026 7:40 AM | Updated on Mar 5 2026 7:40 AM

సంగం: ‘చేపలకు మేతగా చికెన్‌ వ్యర్థాలను తరలిస్తూ ప్రజల ఆరోగ్యంతో టీడీపీ నేతలు చెలగాటమాడుతున్నారు.. చికెన్‌ వ్యర్థాల దందాకు పూర్తి సహకారం అందిస్తున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి మా సొంత నగదుతో ప్రతిరోజూ చేపలను పంపిస్తాం. ఆయన తిని ఆరోగ్యం ఎలా ఉందో చెప్పాలి’ అని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సంగం మండలం దువ్వూరు వద్ద సాగు చేస్తున్న చేపల గుంతలు, అందులో వేసి ఉన్న చికెన్‌ వ్యర్థాలను బుధవారం రాత్రి ఆయన నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సంగం మండలంలో సుమారు రెండు వేల ఎకరాల్లో చేపల గుంతలను సాగు చేస్తున్నారని తెలిపారు. చేపలకు దాణాకు బదులుగా చైన్నె, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి చికెన్‌ వ్యర్థాలను అక్రమంగా తరలించి వేస్తున్నారని, దీని వల్ల ప్రజారోగ్యం పూర్తిస్థాయిలో దెబ్బతింటోందన్నారు. మరోవైపు భూగర్భజలాలు కలుషితమై సమీప గ్రామాల ప్రజలు వ్యాధుల బారినపడుతున్నారన్నారు. చేపలకు చికెన్‌ వ్యర్థాల వినియోగాన్ని కట్టడి చేయాలని గత నవంబర్‌లో కలెక్టర్‌కు లేఖ ద్వారా తెలియజేసినా ఫలితం లేదన్నారు. అందుకే క్షేత్రస్థాయిలో చెరువులను పరిశీలించి చికెన్‌ వ్యర్థాల దందాను ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. చేజర్ల, సంగానికి చెందిన చోట నాయకుల సహకారంతో మరోనేత చికెన్‌ వ్యర్థాల దందాను సాగిస్తూ లక్షలు సంపాదిస్తూ నేరుగా మంత్రి కార్యాలయానికి లెక్కలు చెప్తున్నారన్నారు. ఆయన అండతోనే అధికారులు కూడా అక్రమార్కులను ఏమీ చేయలేకపోతున్నారన్నారు. ఈ విషయాన్ని నూతనంగా జిల్లాకు వచ్చిన ఎస్పీకి సైతం తెలియజేస్తామని, వారం రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. మంత్రి, అధికారులు అంతదూరం తెచ్చుకోకుండా వెంటనే ప్రజారోగ్యాన్ని దెబ్బతిసే ఈ దందాను నిలిపేయాలని కోరుతున్నామన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడు పులగం శంకర్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కరిముల్లా, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు దేవసహాయం, నేతలు సూరి మదన్‌మోహన్‌రెడ్డి, గుండాల బాలచంద్రారెడ్డి, పూనేటి ఫణికుమార్‌రెడ్డి, శంకరయ్య, బాబు, మాజీ ఎంపీటీసీ సభ్యులు హజరత్తయ్య, నెల్లూరు కోటారెడ్డి, సర్పంచ్‌ మానికల చందు, జనార్దన్‌, మాబాషా, సీతారామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చేపల గుంతలను పరిశీలిస్తున్న

మాజీ ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి

చికెన్‌ వ్యర్థాల దందాకు

మంత్రి ఆనం సహకారం

సొంత నగదుతో చేపలను రోజూ పంపిస్తాం

తిని ఆరోగ్యం ఎలా ఉందో ఆయన చెప్పాలి

మాజీ ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement