పిన్నెల్లి వెంటే మాచర్ల ప్రజలు | - | Sakshi
Sakshi News home page

పిన్నెల్లి వెంటే మాచర్ల ప్రజలు

Mar 5 2026 7:40 AM | Updated on Mar 5 2026 7:40 AM

మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య

జిల్లా కేంద్ర కారాగారంలో ములాఖత్‌

నెల్లూరు రూరల్‌: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెంటే మాచర్ల నియోజకవర్గ ప్రజలున్నారని, రానున్న ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించడం తథ్యమని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు. అక్రమ కేసులో నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న పిన్నెల్లి సోదరులతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జునయాదవ్‌తో కలిసి బుధవారం ములాఖత్‌ అయ్యారు. ఈ సందర్భంగా సంజీవయ్య మాట్లాడారు. 84 రోజులుగా రామకృష్ణారెడ్డి రిమాండ్‌లో ఉన్నారని, అయినా చాలా ధైర్యంగా ఉన్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచనలతో పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులను బనాయించారని ఆరోపించారు. జైల్లో కనీస సౌకర్యాల్లేవని, కోర్టు ఆర్డర్‌ ఉన్నా.. సరైన ఆహారం, వసతిని కల్పించడంలేదని ధ్వజమెత్తారు. అక్రమ కేసులు పెడుతున్న అధికారులు, దానికి కారణమైన వారిపై తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. జైలు నుంచి త్వరలోనే ఆయన బయటకొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

కక్ష సాధింపు చర్యలు

పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అక్రమంగా నిర్బంధించి, రాజకీయ కక్ష సాధింపులకు టీడీపీ పాల్పడుతోందని నాగార్జునయాదవ్‌ ఆరోపించారు. మాచర్ల నియోజకవర్గంలో తమ పార్టీ నేతలపై 584 అక్రమ కేసులను నమోదు చేసి.. వేలాది మంది కార్యకర్తలను జైలుకు పంపారని ధ్వజమెత్తారు. సర్కార్‌ వేధింపులను తట్టుకోలేక సుమారు నాలుగు వేల కుటుంబాలు వలసెళ్లాయని చెప్పారు. జైల్లో ఫ్యాన్‌ రెగ్యులేటర్‌ కూడా లేకుండా చేసి ఆయనకు గాలి అందకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పిన్నెల్లి పడుతున్న ఇబ్బందులను సీసీ కెమెరాల ద్వారా వీక్షిస్తూ ఆనందిస్తున్నారని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement